
TDP vs JANASENA: చంద్రబాబునాయుడితో పవన్‌కల్యాణ్ మైండ్‌గేమ్?
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో ఆయన మైండ్‌గేమ్ ఆడుతున్నారని, పరిస్థితులను తనకు అనువుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి పవన్ మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా..
రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేయడం, జనసేన-బీజేపీ కలిసి పోటీచేయడం, జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి పోటీచేయడం. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలించిన తర్వాత పవన్ కల్యాణే స్వయంగా ఒక ఆప్షన్ ఎంచుకున్నట్లు సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పర్చూరు బహిరంగసభలో జనసేనాని మాట్లాడిన మాటలను బట్టి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తనకు ఎవరితోను పొత్తుండదని, పొత్తులపై మాట్లాడే సమయం కాదని, తన పొత్తు కేవలం ప్రజలతోనే ఉంటుందని ఆ సభలో జనసేనాని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక జారీచేసిన పవన్ కల్యాణ్
ఒకరకంగా ఆయన తెలుగుదేశం పార్టీకి ఈ వేదిక నుంచి హెచ్చరిక జారీచేశారని భావిస్తున్నారు. పొత్తుకు తాను సిద్ధంగా లేననే విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. చంద్రబాబునాయుడు లాంటి సీనియర్ నేత, పరిపాలన దక్షత ఉన్న నేతను ముఖ్యమంత్రి పదవి త్యాగం చేయాలని కోరడానికి ఇది సరైన సమయం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుల్లో కూరుకుపోయి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఏపీని గాడిన పెట్టాలంటే చంద్రబాబు ఒక్కడే సమర్థవంతమైన నేత అని చెబుతున్నారు.

త్యాగానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు?
టీడీపీ నేతలు కూడా చంద్రబాబు అనుభవం, పాలనా దక్షత గురించి పదే పదే మీడియా సమావేశాల్లో ప్రస్తావిస్తుండటంద్వారా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా లేదనే విషయం స్పష్టమవుతోంది. జనసేనాని 2024 ఎన్నికలు కీలకమనే అభిప్రాయంతో ఉన్నారు. 2014 ఎన్నికల్లోనే పోటీచేయకుండా తప్పుచేశానని, అప్పుడే పోటీచేసివుంటే ఈరోజు పార్టీ ఇతర ప్రధాన పార్టీలను డిమాండ్ చేసే స్థితిలో నిలబడి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఈసారి తాను లొంగిపోతే పూర్తిగా నష్టపోతామని, చంద్రబాబును మరోసారి ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి? అంటూ కార్యకర్తలు, నాయకులు అడుగుతున్నారని, తాను తగ్గితే ఒక ప్రధాన సామాజికవర్గంతోపాటు తనకు, పార్టీకి దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందనే అభిప్రాయంలో పవన్ ఉన్నారు.

బీజేపీతో దూరంగా.. దగ్గరగా??
పోటీచేస్తే బీజేపీతో కలిసి పోటీచేయడం.. లేదంటే ఒంటరిగా పోటీచేయడం అనే ఒక స్పష్టమైన నిర్ణయానికి జనసేన పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీతో కూడా జనసేన దూరంగానే ఉంటోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎక్కడా జనసేన జెండా కనపడటంలేదు. ఈమేరకే పార్టీ శ్రేణులకు అంతర్గతంగా ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో దాదాపుగా బీజేపీతో పొత్తు అవకాశాల్లేవని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమవుతుందని భావిస్తున్నారు. కానీ అందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందా? లేదా? అనే విషయం స్పష్టమవ్వాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు..!!