షర్మిలకు ఫోన్ చేశారుకానీ.. మేం గుర్తుకు రాలేదా మోడీగారు?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేశారంటూ రెండురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వార్త హోరెత్తిస్తోంది. చేశారా? చేయలేదా? అనే విషయంలో ఎవరూ స్పష్టత ఇవ్వడంలేదు. చేశారు ప్రధానమంత్రి చేశారు అనుకుంటే కేసీఆర్ కు ఒక ఆయుధం దొరికినట్లవుతుంది. చేయలేదు అనుకుంటే ఏ రాజకీయమూ అవసరంలేదు.
షర్మిలను అరెస్ట్ చేసిన విధానంపై తెలంగాణ బీజేపీ నేతలంతా మండిపడ్డారు. చివరకు మోడీ ఫోన్ చేశారని, 10 నిముషాలు మాట్లాడారంటూ వార్త వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి షర్మిల బీజేపీ వదిలిన బాణం అని ప్రచారం చేయడానికి సరంజామా అంతా సిద్ధం చేసుకుంది. షర్మిల మీద టీఆర్ఎస్ దౌర్జన్యం చేస్తే మోడీ పరామర్శించడాన్ని చూస్తే ఆమె ఎవరు వదిలిన బాణమో అర్థమవుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

అలాగే మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ వార్డు సభ్యురాలు కూడా కాని షర్మిలకు మోడీ ఫోన్ చేయడాన్ని బట్టి అర్థమవుతోందని, కేసీఆర్ గురించి తక్కువచేసి మాట్లాడితే తెలంగాణలోని రాళ్లకూ పవర్ ఉంటుందని తెలుసుకోవాలంటూ ఘాటుగా స్పందించారు. తమ నాయకుణ్ని విశాఖపట్నంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బంది సమయంలో ప్రధానమంత్రి పవన్ కల్యాణ్ కు ఫోన్ చేస్తే బాగుండేదని, మిత్రపక్షంగా కూడా అప్పుడు గుర్తుకురాని మోడీకి ఏ పక్షమూ లేని షర్మిల ఎలా గుర్తుకొచ్చిందని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో అణచివేతకు గురైన సందర్భంలో కనీసం పరామర్శలు కూడా లేవని, సోము వీర్రాజు మొక్కుబడిగా తమ పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్లారని జనసేన నాయకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.