క్యా సీన్ హై... పవన్‌కు రాపాక భారీ ఝలక్... రాజకీయాల్లో ఇలాంటి సీన్ అరుదు...
రాపాక వరప్రసాద్... జనసేన పార్టీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే... అలా అని ఆ పార్టీ లైన్‌లో ఆయన ఏనాడు నడిచింది లేదు. అధినేత పవన్ కల్యాణ్ ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటారు. పోనీ తెగదెంపులు చేసుకుని ఆయన దారి ఆయన చూసుకుంటారా అంటే అదీ లేదు. ఇప్పటికీ అసెంబ్లీలో జనసేన కోటాలోనే కొనసాగుతున్నారు. ఒకరకంగా జనసేనాని పవన్ కల్యాణ్‌కు కొరుకుపడని కొయ్యలా మారిన రాపాక ఇప్పుడు అధినేతకు మరో షాకిచ్చారు.

రాపాక కుమారుడు జనసేనలోకి...
స్వయంగా తన తనయుడిని వెంటపెట్టుకుని మరీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాపాక.. తన సమక్షంలోనే కొడుకు రాపాక వెంకట్ రామ్‌ను అధికార పార్టీలో చేర్చారు. ఇప్పటికీ జనసేన పార్టీలోనే కొనసాగుతున్న ఎమ్మెల్యే రాపాక దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అన్నింటికిమించి... ఇది పవన్ కల్యాణ్‌కు రాపాక మార్క్ 'పోటు' అని జనం అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే ఇలా స్వయంగా తన కొడుకుని తీసుకెళ్లి మరో పార్టీలో చేర్పించిన సందర్భం లేదని గుర్తుచేస్తున్నారు. ఈ సీన్ చూశాకైనా పవన్ కల్యాణ్ రాపాకపై వేటు వేస్తారా లేక ఇంతకుముందు లాగే చూసీ చూడనట్లు వదిలేస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

జగన్‌ను ఆకాశానికెత్తేస్తున్న రాపాక...
గురువారం(డిసెంబర్ 3) అసెంబ్లీలో మాట్లాడిన రాపాక... తాను బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారంటే సీఎంను ఆయన ఏ స్థాయిలో కీర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు . ఊహాతీతమైన పథకాలను వాస్తవంలోకి తీసుకొచ్చారని చెప్పారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు. ఎవరూ చేయని ఆలోచనలను వైఎస్ జగన్ చేశారని, దాన్ని అమలు చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. రాత్రిపూట వైఎస్ జగన్ నిద్ర కూడా పోరేమోనని.. ప్రజల కోసం రేపటికి ఎలాంటి మేలు చేకూర్చాలనే ధ్యాసతో నిద్రపోకుండా గడుపుతుంటారేమోనని రాపాక వ్యాఖ్యానించడం గమనార్హం..

గెలిచిన కొన్నాళ్లకే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 143 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆఖరికి అధినేత పవన్ కల్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోగా... కేవలం రాపాక వరప్రసాద్ మాత్రమే రాజోలు నుంచి పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పోనీ ఆ ఒక్క ఎమ్మెల్యే అయిన అసెంబ్లీలో జనసేన గళం వినిపిస్తారనుకుంటే... గెలిచిన కొన్నాళ్లకే ఆయన వైసీపీ స్వరం అందుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ.. కొన్నిసార్లు వైసీపీ నేతలను సైతం మించిపోయి రాపాక సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.