• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విజయవాడలో కీలకంగా జనసేన-ఓట్ల చీలికతో వైసీపీకి గండి- కాపులకు రాధా పిలుపు ?

|

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పడం లేదు. గతంలోలా ఈసారి ఏ పార్టీకి కూడా ఏకపక్ష విజయాన్ని అందించేందుకు ఓటర్లు సిద్దంగా లేరని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు మూడు రాజధానులు, సంక్షేమం ఇలా పలు అంశాలు ఇక్కడ ప్రభావం చూపిస్తున్నా స్ధానిక, కుల సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే తొలిసారి కార్పోరేషన్ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ ఖాతా తెరవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అధికార వైసీపీకి మైనస్‌ కాబోతుండటం ఇక్కడ మరో విశేషం. అదే జరిగితే మేయర్‌ పీఠం కోసం వైసీపీ చేస్తున్న పోరుకు అడ్డుకట్ట పడక తప్పేలా లేదు.

 బెజవాడ కార్పోరేషన్‌లో హోరాహోరీ

బెజవాడ కార్పోరేషన్‌లో హోరాహోరీ

విజయవాడ కార్పోరేషన్‌లోని 64 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికలు ఈసారి హోరాహోరీగా మారిపోయాయి. గతంలో ప్రభుత్వంలో ఎవరుంటే వారికి అనుకూలంగా ఉంటాయని భావించే ఇక్కడి ఎన్నికలు ఈసారి మాత్రం అధికార పార్టీకి అందరి కంటే ఎక్కువగా చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇందులో రెండేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో వైసీపీ విజయవాడను ఏమాత్రం పట్టించుకోకపోవడం ఓ ఎత్తు అయితే, మూడు రాజధానుల వ్యవహారంతో తమకు అన్యాయం చేస్తుందన్న భావన ఇక్కడి ప్రజల్లో తీవ్రంగా ఉండటం మరో ఎత్తుగా మారింది. అయితే ఈ వ్యతిరేకతను విపక్షాలు పూర్తి స్ధాయిలో సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అడ్డుపడుతున్నాయి. దీంతో విజయవాడ పోరు ఆసక్తికరంగా మారిపోయింది.

 విజయవాడలో కీలకంగా జనసేన

విజయవాడలో కీలకంగా జనసేన

రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పరిస్థితి ఎలా ఉన్నా ఈసారి విజయవాడలో మాత్రం జనసేన ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో తమకు స్ధిరమైన ఓటు బ్యాంకు లేకపోయినా కొన్ని సమీకరణాలతో జనసేన ప్రభావం కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ, సీపీఐతో కుదిరిన రహస్య అవగాహన జనసేనకు భారీగా మేలు చేయబోతోంది. ఈ ప్రభావం సీట్లపై కంటే ఓట్లపై ఎక్కువగా పడుతుండటం ఇక్కడ మరో విశేషం. గతంలో ప్రజారాజ్యం పార్టీ ప్రభావంతో 2019 ఎన్నికల్లో ఓట్లు చీలి టీడీపీ దెబ్బతిన్న తీరుగానే ఈసారి అధికార వైసీపీకి జనసేన ఓట్లు గండికొట్టబోతున్నట్లు తెలుస్తోంది.

 కాపుల్ని ఏకం చేస్తున్న జనసేన

కాపుల్ని ఏకం చేస్తున్న జనసేన

గతంలో కాపు ఓట్లను పూర్తి స్ధాయిలో సమీకరించడంలో విఫలమై సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న జనసేన ఈసారి మాత్రం ఆ సామాజిక వర్గ ఓట్లను పోలరైజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో గతంలో అధికార పార్టీలకు గంపగుత్తగా ఓట్లు వేసిన కాపులంతా ఈసారి తమ కులానికి చెందిన అభ్యర్ధులకు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన నిలబెట్టిన కాపు సామాజిక వర్గ అభ్యర్ధులు ఈసారి భారీగా ఓట్లు చీల్చబోతున్నట్లు స్ధానికంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇవన్నీ అధికార వైసీపీ ఓట్లే కావడంతో ఆ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి.

 జనసేనకు వంగవీటి రాధా మద్దతు ?

జనసేనకు వంగవీటి రాధా మద్దతు ?

విజయవాడ నగరంలో కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న వంగవీటి రాధా టీడీపీ, జనసేనకు మార్గదర్శనం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆయన ఇప్పుడు తమ సామాజిక వర్గాన్ని లీడ్‌ చేస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న చోట టీడీపీకి, జనసేన బలంగా ఉన్న జనసేనకు ఇతర పార్టీల మద్దతు ఇప్పించడం ద్వారా కార్పోరేషన్ పోరులో వంగవీటి రాధా కీలకంగా మారిపోయారు. ముఖ్యంగా జనసేన కనీసం రెండు నుంచి మూడు సీట్లు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా చోట్ల కాపుల ఓట్లు టీడీపీతో పాటు జనసేనకూ పోలరైజ్ అవుతుండటం ఇద్దరికీ మేలు చేయబోతోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా.. జనసేన గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిరేపుతున్నాయి.

English summary
pawan kalyan led janasena party seems to open its account in vijayawada corporation polls with polarisation of kapu community votes and tdp, cpi support this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X