ఇసుక కోసం పోరాటం .. కార్మికులతో కలిసి మంత్రి ఇంటిని ముట్టడించిన జనసేన
ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై సమరం సాగిస్తున్నాయి. పాలకుల పట్టింపులేనితనం వల్ల నిర్మాణ రంగం కుదేలైందని నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ ఇసుక మాత్రం ఏపీలో అందని ద్రాక్షగా మారింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ఇక ఇసుక కొరతను నిరసిస్తూ ఇప్పటికే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్లు ఆందోళనలు చేసింది. ట్రాక్టర్లతో ర్యాలీలు, ఇసుకతో దండలు మెడలో వేసుకుని నిరసనలు నిర్వహించింది. ఇక జనసేన పార్టీ సైతం నిర్మాణ రంగ కార్మికుల కోసం సమరానికి సై అంది.
కృత్రిమ ఇసుక కొరతకు నిరసనగా తాజాగా భవన నిర్మాణ కార్మికులతో కలసి జనసేన నేతలు ఆందోళన బాట పట్టారు.విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ అసమర్ధతతో రోడ్డున పడ్డారని ఆందోళన నిర్వహించారు జనసేన పార్టీ శ్రేణులు.కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని కార్మికులు మంత్రి ఇంటి ముందు బైఠాయించి నినదించారు.

ఇక కార్మికులు తమ కష్టాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆకలి కేకలు వేస్తున్నామని మంత్రికి చెప్పి ఆవేదన వెళ్లగక్కారు. ఈ సందర్భంగా కార్మికులు, జనసేన నేతలతో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వం ఇసుక కొరతకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తుందని, త్వరితగతిన కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు. కార్మికులతో రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చేసే వాటికి కార్మికులు మద్దతు ఇవ్వరాదని కోరారు మంత్రి అవంతి శ్రీనివాస్ .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!