చంద్రబాబుకు నోటీసులు ఒక్క పేజీనే..అదే జగన్ కు అయితే లారీల్లోనే: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం మరోమారు దుమారం రేపుతుంది. అమరావతి భూములు అక్రమాలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడంతో టీడీపీ నేతలు జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్న చర్యగా అభివర్ణిస్తున్నారు. జగన్ 16 నెలలు జైలుకు వెళ్ళాడు కాబట్టి చంద్రబాబును కూడా జైలుకు పంపించాలని కుట్రలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

జగన్ పై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చంద్రబాబు సిఐడి నోటీసులు జారీ చేయడంతో, దీనిపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబుకి సిఐడి ఒక పేజీ నోటీసు మాత్రమే ఇచ్చిందని, అదే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే లారీలలో తీసుకు వెళ్లాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
నాడు చంద్రబాబు నాయుడు కి రాజధాని విషయంలో పలు సూచనలు చేశానని చెప్పిన జెసి దివాకర్ రెడ్డి ఒకసారి రాజధాని నిర్ణయం జరిగిన తరువాత మార్చడం సరికాదని, నాడు చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేయడానికి మొగ్గు చూపారని పేర్కొన్నారు.

మా వీపు పగిలినప్పుడే చంద్రబాబు వీపు పగలాల్సింది .. కాకుంటే ఆలస్యం అయింది
ఏపీ టీడీపీ కీలక నేత జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా వీపు పగిలినప్పుడే చంద్రబాబు వీపు పగలాల్సిందని, కాకుంటే ఆలస్యమైందని పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే చంద్రబాబుకు నోటీసులు రావాల్సి ఉందని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇమేజ్ తోనే తాడిపత్రిలో ఎక్కువ వార్డులను గెలిచామని చెప్పుకొచ్చారు జెసి దివాకర్ రెడ్డి.

తెలంగాణా ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందన్న దివాకర్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన సందర్భంగా ఈరోజు ఏపీ రాష్ట్రంలో తాజా పరిణామాలపై మాట్లాడిన జెసి దివాకర్ రెడ్డి అటు తెలంగాణ రాష్ట్రం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి తప్పు చేసిందని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీసం అధికారంలోకి రాలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కలిసి సీఎం కావాలన్న అత్యాశతో కాంగ్రెస్ పార్టీని చంపేశారని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాలం చెల్లిందన్న జేసీ
తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినా బంగారు తెలంగాణాగా మాత్రం మారలేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాలం చెల్లిందని పేర్కొన్న జెసి దివాకర్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ముఖ్యంగా జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.