jc diwakar reddy mines officials conspiracy cases family jc prabhakar reddy police జెసి దివాకర్ రెడ్డి గనులు అధికారులు తనిఖీలు తాడిపత్రి కుట్ర కేసులు కుటుంబం జెసి ప్రభాకర్ రెడ్డి పోలీసులు
మైన్స్ కూడా లేకుండా చేస్తారా ... రెట్టింపు సత్కారం చేసి రుణం తీర్చుకుంటా : జేసీ దివాకర్ రెడ్డి ఫైర్
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి నియంత పాలన ఇంకా ఎంతకాలం ఉంటుందో చూస్తానంటూ ఏపీ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు . తాడిపత్రి భూగర్భ గనుల కార్యాలయం వద్ద తమ గనుల్లో అధికారుల తనిఖీలు దేని కోసమో చెప్పాలని హల్ చల్ చేశారు.
జగన్ క్విడ్ ప్రోకో 2కు తెరలేపారు ..మంత్రులు స్థాయి మరచి మాట్లాడుతున్నారు..యనమల,అమర్నాథ్ రెడ్డి ఫైర్

గనుల్లోకి నక్సలైట్లు ఏమైనా వచ్చారా ? తనిఖీలు దేనికి ?
తన కుటుంబంపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని జెసి మండిపడ్డారు. తన భార్య, చెల్లి పేరుతో తాడిపత్రిలో గనులు ఉన్నాయని , సున్నపురాయి గనుల లీజు విషయంలో కూడా గనులను క్లోజ్ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారని జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు. సున్నపురాయి గనులను తనిఖీ చెయ్యటానికి వాహనాల్లో 50 నుండి 60 మంది వెళ్లారని పేర్కొన్న జెసి దివాకర్ రెడ్డి వైజాగ్ నుండి తన గనులకు నక్సలైట్లు ఏమైనా వచ్చారా ? పోలీసులు వారి కోసం గాలిస్తున్నారా ? అని ప్రశ్నించారు . తాను వెళ్ళగానే అధికారులు పారిపోయారన్నారు .

నా బ్రదర్ ను లోపలేశారు .. ఇప్పుడు నా జోలికి వస్తున్నారన్న జేసీ
రాజకీయాలకు దూరంగా తన కుటుంబంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నానని తన కుటుంబాన్ని టార్గెట్ చేసి కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇదంతా చేస్తున్నారని జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే నా బ్రదర్ ను లోపలేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన జెసి దివాకర్ రెడ్డి, తమ కుటుంబంపై పెడుతున్న కేసులన్నీ కక్షసాధింపు లో భాగమే అన్నారు.
తాడిపత్రిలోని సున్నపురాయి గనులు తప్ప తనకు ఇతర ఆస్తిపాస్తులు ఏమీ లేవని, ఈ ఆదాయంతోనే తాను బ్రతుకుతున్నాం అని, తనకు తిండి కూడా లేకుండా మాడ్చి చంపేందుకు ఇదంతా చేస్తున్నారంటూ జెసి దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

మైనింగ్ కూడా లేకుండా చేస్తారా ?
తమకు జీవనాధారమైన మైనింగ్ కూడా లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. తనకు మైనింగ్ పర్మిట్లు ఇవ్వాలంటూ, ఇవ్వకుంటే భూగర్భ గనుల కార్యాలయం ముందే నిరాహార దీక్ష చేస్తానంటూ జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల సత్కారాలు చేయడానికి రెడీగా ఉన్నారని, ఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాణ్ణి అని పేర్కొన్నారు. మీరు నాకు సత్కారం చేస్తే అందుకు రెట్టింపు సత్కారం ఏదో ఒక రోజు తప్పక జరుగుతుందని జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.

తనకు సత్కారం చేసే వాళ్లకు తప్పక రెట్టింపు సత్కారం చేసి ఋణం తీర్చుకుంటా
తనకు సత్కారం చేసే పెద్ద వాళ్లకు కచ్చితంగా సత్కారం చేసి ఋణం తీర్చుకుంటానని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులకు ఎలాంటి రూల్స్ ఉండవన్నారు. బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కోడి కంటే హీనంగా కాల్చుకొని తింటున్నారు అని జెసి అసహనం వ్యక్తం చేశారు. ఇంత బానిసలాగా అధికారులు ఎందుకు బ్రతుకుతున్నారు అంటూ జెసి దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము లీజుకు తీసుకున్న గనుల్లో తనిఖీలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు జేసి దివాకర్ రెడ్డి. పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి భయపడి ఊడిగం చేయొద్దంటూ హితవు పలికారు