సీఎం జగన్ మూర్ఖుడు.. ఢీకొడితే మనకే పగులుద్ది.. జేసీ సంచలన కామెంట్లు
దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని, తమ కుటుంబం విషయంలో సీఎం జగన్ మరీ మూర్ఖంగా, తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ మారాలని ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దివాకర్ ట్రావవెల్స్ అధినేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంపై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైకోర్టు చెప్పినా వినకుండా..
రూల్స్ కు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నారన్న ఆరోపణలపై రెండు నెలల కిందట దివాకర్ ట్రావెల్స్ కు చెందిన పలు బస్సుల్ని ప్రభుత్వం సీజ్ చేసింది. దీనని సవాలు చేస్తూ జేసీ కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు బస్సుల్ని రిలీజ్ చేసిన అధికారలు.. మళ్లీ మంగళవారం తెల్లవారుజామునే ఆరు బస్సుల్ని సీజ్ చేశారు. కోర్టు చెప్పినా వినకుండా మళ్లీ బస్సులు సీజ్ చేయడమేంటని ప్రభుత్వం, అధికారుల తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

భయపడి పార్టీ మారాలా?
‘‘కేవలం మేము టీడీపీలో ఉన్నాం. మా బ్రదర్(జేసీ దివాకర్ రెడ్డి) ఎవరిగురించైనా నిజాలు మాట్లాడుతారు. నిజాలు మాట్లాడుతాం కాబట్టే మేం ధైర్యంగా ఉంటాం. నిజాలు మాట్లాడతాం కాబట్టి ధైర్యంగా ఉంటాం. ఈ కారణాల వల్లే జగన్ మమ్మల్ని టార్గెట్ చేశాడు. మా బస్సుల్ని సీజ్ చేయించాడు. తర్వాత.. జైలుకు పంపుతాడా? గట్టుకిస్తాడా? చేసుకోనివ్వండి.. అన్నిటికీ మేం రెడీగానే ఉన్నాం. ఆ పార్టీలో చేరు.. ఈ పార్టీలో చేరు.. అని బయపెడితే మేం మారిపోవాలా? అంత అవసరంగానీ, అగత్యంగానీ మాకు పట్టలేదు''అని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

అధికారుల్ని వదిలిపెట్టం..
కోర్టు విడుదల చెయ్యమన్న తర్వాత కూడా దివాకర్ బస్సుల్ని సీజ్ చేసి అధికారులు చాలా పెద్ద తప్పు చేశారని, ఈసారి హైకోర్టులో కేసును అధికారులపైనే వేస్తామని జేసీ చెప్పారు. పక్కజిల్లా ఆర్టీఏ అధికారులతో సీజ్ చేయించడమేంటో అర్థంకాని వ్యవహారంలా ఉందని, అత్యుత్యాహం ప్రదర్శించిన అధికారులెవర్నీ వదిలిపెట్టబోమని, అందరిపైనా కేసులు పెడతామని తెలిపారు. దివార్ ట్రావెల్స్ బస్సులు రూల్స్ ను డీవియేట్ చేశాయంటోన్న ఆర్టీఏ అధికారులు.. ఆ విషయాన్ని రిపోర్టులో ఎందుకు రాయడంలేదని ఆయన ప్రశ్నించారు.

అన్నకు 70.. నాకు 60..
జగన్ సీఎం అయిన తర్వాత ట్రావెల్స్ యజమానులందరూ ఐపీ పెట్టే పరిస్థితి నెలకొందన్న జేసీ.. మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రితో నేరుగా తలపడే ఎవరికైనా తలలు పగలటం ఖాయమని, కాబట్టే లీగల్ గానే ఫైట్ చేస్తామన్నారు. ‘‘మా అన్నకు 70 ఏండ్లు.. నాకు 60 ఏండ్లు.. మేం ఇంకా తినేది, దాచిపెట్టుకునేది ఏమీ లేదు. ఎవడికీ భయపడాల్సిన పనిలేదు. మేం అడ్డగోలుగా సంపాదించలేదుకాబట్టి మాకు ఏ భయమూ లేదు. ఇప్పుడు జగన్ టైమ్ నడుస్తోంది. ఆయన ఏం చెబితే అది జరిగిపోతోంది.. అయినాసరే మేం భయపడి పార్టీ మారబోము''అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.