పవన్ కరివేపాకు , బండి సంజయ్ లో లెవల్ .. చంద్రబాబువి పగటి కలలు : కేఏ పాల్ సంచలనం
గతంలో ఏపీ రాజకీయాలలో నేను సైతం అంటూ ప్రజాశాంతి పార్టీ పేరుతో సంచలనం సృష్టించిన కె ఏ పాల్ మరోమారు ఏపీ రాజకీయాలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కుళ్ళు, కుట్రలతో కొందరు రాజకీయ నాయకులు ఏపీ, తెలంగాణను రెచ్చగొడితే ఊరుకునేది లేదంటూ వ్యాఖ్యానించిన కే ఏ పాల్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ లోకల్ నాయకుడు, లో లెవెల్ కి దిగిపోయిన నాయకుడు అంటూ తిట్టిపోశారు.

ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు తనకు గౌరవం ఇస్తారన్న కేఏ పాల్
తిరుపతి ఉప ఎన్నికపై
బైబిల్ పట్టుకున్న వారికి ఓట్లు వేస్తారా ? భగవద్గీత పట్టుకున్న వాళ్ళకు ఓట్లు వేస్తారా అని .. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా మాట్లాడే ముందు జాతీయ నాయకులతో మాట్లాడిన తర్వాతనే మాట్లాడాలని హితవు పలికారు కె ఏ పాల్. తిరుపతి ఉప ఎన్నికలలో బైబిల్ పట్టుకున్న వారిని కాకుండా, భగవద్గీత పట్టుకున్న వారికి ఓటు వేయాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కె ఏ పాల్ మండిపడ్డారు. ఆర్ ఎస్ ఎస్ ముఖ్య నాయకులు భగవత్, రామ్ లాల్ గారు తనతో చక్కగా మాట్లాడతారని, ఇంద్రస్ , బయా జోషి ఎన్నో సార్లు తన హోటల్ కు వచ్చారని తనను ఎంతో గౌరవించారని చెప్పుకొచ్చారు .

ట్రంప్ ఓటమికి తానే కారణం అన్న పాల్.. బండి సంజయ్ కు వార్నింగ్
కె ఏ పాల్ బిజెపికి సపోర్ట్ చేయాలని వారంతా తనను కోరారని చెప్పారు.
డోనాల్డ్ ట్రంప్ ఓటమికి కూడా తానే కారణం అన్నాడు కే ఏ పాల్. ట్రంప్ తనచుట్టూ 18 సంవత్సరాలు తిరిగారని, చిత్తు చిత్తుగా ఓడిస్తాం అని చెప్పి మరీ ఓడించానని, దేవుడు తనతో, ప్రజలతో ఉన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బండి సంజయ్ కు హితవు పలికారు. ఇదే సమయంలో చంద్రబాబుపై కూడా నిప్పులు చెరిగారు కేఏ పాల్. చంద్రబాబు నాయుడు కి సిగ్గు లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .

చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్
కొడుకుని సీఎం చేయాలని పగటి కలలు కంటున్నారా? అని ప్రశ్నించిన కె ఏ పాల్ ,గతంలో నాతో ఏసుప్రభు మహిమ, కృప అని చెప్పి ఇప్పుడు క్రైస్తవులను తిడతారా అంటూ నిప్పులు చెరిగారు.
ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేలుకోవాలి అని పేర్కొన్న కే ఏ పాల్ కరివేపాకును వాడుకొని ఎలా వదిలేస్తారో , ఇప్పుడు తిరుపతి లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి పవన్ కళ్యాణ్ ని కూడా అలాగే వదిలేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక పెద్ద కాపు నాయకుడు తో మాట్లాడానని చెప్పారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వెయ్యొద్దన్న బండి సంజయ్
రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని హిందువులు ,ముస్లింలు, క్రైస్తవులు ను కలుపుకొని వెళదామని కె ఏ పాల్ పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఏ ఒక్కరు ఓటు వెయ్యొద్దు అంటూ కె ఏ పాల్ పిలుపునిచ్చారు. భారతదేశం నష్టపోకుండా తాను కాపాడుకుంటూ వస్తున్నానని కె ఏ పాల్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ తనను ఎంతో గౌరవిస్తారని, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , నడ్డా తదితరులు తనను హోటల్ లో కలిసి అభివృద్ధి కోసం అంతా కలిసి పని చేద్దాం అన్నారని చెప్పారు .