కన్నా రూట్ క్లియర్ - కీలక భేటీ : ముహూర్తం ఫిక్స్..!?
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం ప్రకటనకు సిద్దమయ్యారు.
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక ప్రకటనకు సిద్దమయ్యారు. కొంత కాలంగా ఆయన బీజేపీ వీడటం ఖాయమని ప్రచారం సాగుతోంది. టీడీపీ - జనసేనలో ఏ పార్టీలో చేరుతారనే దాని పైన ప్రచారం సాగింది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగారు. కన్నాతో చర్చలు చేసారు. తాను పార్టీ మారుతున్నాననేది కొందరు చేస్తున్న ప్రచారంగా చెప్పుకొచ్చారు. కానీ, బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులుగా జనసేనాని పవన్ కు అనుకూలంగా కన్నా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో కన్నా పార్టీ మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ రోజు తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పైన ఆగ్రహంగా ఉన్నారు. జనసేనతో పొత్తు కొనసాగింపులో సందేహాలు మొదలవ్వటంతో కన్నా ఒక్క సారిగా ఫైర్ అయ్యారు. ఆ తరువాత జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ గుంటూరులో కన్నా తో భేటీ అయ్యారు. ఇది మర్యాద పూర్వక భేటీగానే ఇద్దరు నేతలు స్పష్టం చేసారు. అయితే..కన్నా జనసేనలోకి వెళ్తారని అందరూ భావించారు. ఇప్పటికీ జనసేన - బీజేపీ పొత్తు కొనసాగుతున్న పరిస్థితుల్లో కన్నా బీజేపీ నుంచి జనసేనలోకి వెళ్లటం ద్వారా ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..కన్నా ను టీడీపీలోకి ఆహ్వానిస్తూ ఆఫర్ అందింది. దీని పైన కన్నా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్ లో టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ కన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు తన ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీ నారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. తన నివాసంలో జరిగే ఈ సమావేశంలో తన రాజకీయ ప్రయాణం పైన అనుచరలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. కన్నా తన ఆలోచనలను అనుచరులతో పంచుకోనున్నారు. టీడీపీలో చేరేందుకు కన్నా సిద్దమయ్యారని సమాచారం. ఈ నెల 23వ తేదీన కన్నా టీడీపీలో చేరుతారని చెబుతున్నారు. అయితే, కన్నా జనసేనలో చేరే ఆలోచనతో ఉన్నారనే మరో వాదన అనుచర వర్గం నుంచి వినిపిస్తోంది. ఈ రోజు సమావేశంలో అనుచరులతో చర్చించి..తన నిర్ణయం ప్రకటించేందుకు కన్నా సిద్దమవుతున్నారు. ఆయన బీజేపీని వీడటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, టీడీపీ..జనసేన ఈ రెండు పార్టీల్లో కన్నా చేరిక ఎందులో అనేది నేటి సమావేశంలో క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications