ఛైర్మెన్ లేఖ: నిధుల గోల్మాల్, కాపు కార్పోరేషన్ ఎండీ అమరేంద్రపై వేటు
అమరావతి: నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై కాపు కార్పోరేషన్ ఎండీ అమరేంద్రపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది.అమరేంద్రను ఆయన మాతృశాఖ పశుసంవర్థకశాఖకు బదిలీ చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.ఉదయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ను మాతృశాఖకు పంపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఏపీ రాష్ట్రంలో కాపుల కోసం కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.పేద కాపుల సంక్షేమం కోసం కాపు కార్పేషన్ నిధులను సక్రమంగా ఖర్చయ్యేలా చూడాల్సిన అధికారే నిధులను పక్కదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.
కాపు కార్పొరేషన్‌కు దిశానిర్దేశం చేస్తూ నిధులు సద్వినియోగమయ్యేలా చూడాల్సిన వ్యక్తే అవినీతి అక్రమార్కుడిగా మారారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను స్వాహా చేశారని ఎండీ అమరేంద్రపై ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై రెండేళ్ళుగా చూసీ చూడనట్టుగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.పు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్‌పై వేటు వేసింది.

కాపు కార్పోరేషన్ ఎండీపై బదిలీ వేటు
కాపు కార్పోరేషన్ ఎండీ అమరేంద్రపై బదిలీ వేటు వేసింది. ఎంతటి అవినీతి ఆరోపణలున్నా సాధారణంగా బదిలీ ఉత్తర్వుల్లో అవినీతి ఆరోపణలను కారణంగా చూపరు. కానీ అసాధారణంగా అమరేంద్ర బదిలీ ఉత్తర్వుల్లో అవినీతి ఆరోపణలను కారణంగా చూపడం ఆయన అవినీతి తీవ్రతను చాటుతోంది. అమరేంద్ర హయాంలో కాపు కార్పొరేషన్లో చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాపు కార్పోరేషన్లో నిధుల గోల్మాల్
కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన సమావేశాలు, సభల బిల్లుల విషయంలోనూ ఎండీ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన ఓ సభకు 5 వేల మంది హాజరైతే లక్ష మందికి బిల్లు పెట్టినట్లు కార్పొరేషన్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అంతకుముందు అదే ప్రాంతంలో 5 వేల మంది వచ్చినట్లు చూపించి బిల్లులు పొందిన సభకు కేవలం 163 మంది మాత్రమే హాజరయ్యారని అంటున్నారు.


పథకాల ప్రచారంతోనూ స్వాహాకు యత్నం
కాపు పథకాలపై ప్రచారానికి ఖర్చు చేయాల్సిన నిధులను కొట్టేసే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.18 కోట్ల నిధులను ఐఅండ్‌పీఆర్ ఎంప్యానెల్ చేసిన సంస్థలతో కాకుండా ఇతర ఏజెన్సీలకు కట్టబెట్టాలని ప్రయత్నం జరిగింది. దీనికి ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ససేమిరా అనడంతో ఆ విషయం అక్కడితో ఆగింది. మరో అధికారితో కలిసి నిధులను స్వాహా చేసేందుకే ముఖ్య అధికారి ఈ తతంగం నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎండీపై కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ లేఖ
నిబంధనలకు విరుద్ధంగా ఎండీ తన తల్లి వైద్య ఖర్చుల కోసం రూ.31లక్షలు తీసుకున్నారని దానిపై విచారణ జరిపించాలని కార్పొరేషన్ చైర్మన్ స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో కార్పొరేషన్ల అక్రమాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణితో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎండీని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బాధ్యతలను బీసీ సంక్షేమశాఖ కార్యదర్శికి అప్పగించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.

కోచింగ్ తీసుకోని వారి పేర్లతో బిల్లుల స్వాహ
విద్యోన్నతి పథకం కింద పేద కాపు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేశారు. గ్రూప్స్, సివిల్స్, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు వాటి ద్వారా కోచింగ్ ఇప్పిస్తున్నారు. అయితే అర్హత లేకపోయినా కొన్ని ఇన్స్టిట్యూట్లను ఎండీ ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
అసలు కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోనివారి పేర్లను కూడా కోచింగ్ తీసుకుంటున్న వారి జాబితాలో చేర్చారు. ఇటీవల బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉదయలక్ష్మి బాధ్యతలు చేపట్టిన అనంతరం కాపు కార్పొరేషన్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల జాబితాలోని కొందరికి ఫోన్ చేసి మాట్లాడారు. కోచింగ్ ఎలా ఉందని వారిని ఆరా తీయగా... తాము ఎలాంటి కోచింగ్ తీసుకోవడం లేదని సమాధానం రావడంతో ఆమె కంగుతిన్నారు.