మాజీ మంత్రి నారాయణ కేసులో కీలక పరిణామాలు
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు జిల్లా నాలుగో అదనపు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. నారాయణ రాకుండా జామీను తీసుకోవడం కుదరదని సోమవారం కోర్టు నారాయణ లాయర్లకు చెప్పడంతో ఆయనకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈరోజు కోర్టు ఇద్దరి జామీను తీసుకొని బెయిల్ మంజూరు చేసింది.
నారాయణ బెయిల్ మంజూరునకు సంబంధించిన జామీనుదారుల పూచీకత్తును చిత్తూరు కోర్టు ఆమోదించింది. చిత్తూరు పోలీసులు ఈ కేసులో గత వారమే నారాయణను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా బెయిలు మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి ఐదురోజుల గడువు తీసుకున్న నారాయణ లాయర్లు ఇద్దరి పూచీకత్తును సోమవారం కోర్టుకు సమర్పించారు.

నారాయణ రాకుండా జామీను తీసుకోవడం కుదరదని న్యాయమూర్తి అభ్యతరం తెలిపారు. ఆయన్ను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలిచ్చిన తీర్పులను నివేదించడానికి సమయం కోరారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. నారాయణ లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయన రాకుండానే పూచీకత్తును ఆమోదించింది.