విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్మకు, రాధాలకు మధ్య కొడాలి నాని: వంగవీటి సినిమాపై ఎవరి పంతం వారిదే

వంగవీటి సినిమాపై రామ్ గోపాల్ వర్మ, వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఎవరు కూడా మెట్టు దిగడం లేదు. ఇరువురి మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కొడాలి నాని మధ్యవర్తిత్వం ఫలిస్తుందా...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వంగవీటి సినిమాపై వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకు, సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మధ్య రాజీ అంత సులభంగా కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఇరువురికి మధ్య కొడాలి నాని మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇంకా కొన్నిమార్లు సమావేశమైతే తప్ప వివాదం సద్దుమణిగే పరిస్థితి లేదని నాని అన్నారు.

వర్మ వివాదాస్పదమైన వ్యక్తి, తన తమ్ముడు రాధా కూడా అంతే వివాదాస్పదమైన వ్యక్తి, అటువంటి ఇద్దరి మధ్య రాజీ అంత సులభంగా కుదరదని ఆయన తేల్చి చెప్పారు. వంగవీటి రంగాను కించపరిచే విధంగా సినిమాను తీశారని రాధా కోర్టుకెక్కారని, దాంతో చర్చలతో పరిష్కరించుకుంటామని సినిమా నిర్మాతలు కోర్టుకు చెప్పారని అన్నారు. దాంతో తాను మధ్యవర్తిగా ఉండి వెసులుబాటు కల్పించానని చెప్పారు.

Vangaveeti-audio

సినిమా తీయకూడదని రాధా కుటుంబ సభ్యులు అనడం లేదని, రంగాను గొప్పగా చూపిస్తే అభ్యంతరం లేదు గానీ అవమానకరంగా చూపిస్తే ఊరుకునేది లేదని అంటున్నారని కూడా ఆయన చెప్పారు. రంగా జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు కాబట్టి కించపరిచే విధంగా ఉండకూడదని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రచారం కోసం వాడుకుంటున్నారా అని అడిగితే - వర్మ వాడుకుంటే వాడుకోవచ్చు గానీ రాధాకు ఆ ఉద్దేశం లేదని, రాధా మీడియా ముందుకు కూడా వచ్చే వ్యక్తి కారని ఆయన అన్నారు.

చేయాల్సింది చేస్తానని రాధా

రామ్ గోపాల్ వర్మ శనివారం వంగవీటి రాధా, వంగవీటి రత్నకుమారితో సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశం ఏ విధమైన ఫలితం ఇవ్వలేదు. వర్మ వచ్చారు, కలిశారు, మాట్లాడారని రాదా అన్నారు. సినిమాపై తన అభ్యంతరాలను కోర్టుకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ఏం అభ్యంతరాలున్నాయనే విషయాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

వివాదం ఏమీ లేదని కూడా రాధా అన్నారు. అలా అంటూనే తమ అభ్యంతరాలను కోర్టుకు తెలియజేసినట్లు తెలిపారు. సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారని అడిగితే తానేం చెప్పగలనని, ఆ విషయాన్ని నిర్మాతలు చెప్పాలని అన్నారు.

సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే సహించబోమని అన్నారు. అలా ఉంటే తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు. రంగా ఒక్క సామాజిక వర్గానికి చెందినవారు కారని అన్నారు. కోర్టుకు చెప్పిన విషయాల ప్రకారం వర్మ, నిర్మాతలు నడుచుకుంటే మంచిదని అన్నారు.

వెనక్కి తగ్గనని రామ్ గోపాల్ వర్మ

రాధా, రత్నకుమారి భేటీ విషయంలో వివాదం ఉందని, ఆ విషయాలు తర్వాత చెప్తానని అన్నారు. సినిమా విషయంలో తాను వెనక్కి తగ్గబోనని చెప్పారు. రాధా, రత్నకుమారిలతో చర్చించిన కొన్ని అంశాల విషయాలపై సమస్యలున్నాయని కూడా అన్నారు.

వంగవీటి సినిమా విడుదలపై రాధా అభ్యంతరాలు తెలిపారని, ఓ ఫిలిం మేకర్‌గా తనకు స్వేచ్ఛ ఉందని అన్నారు. వంగవీటి రంగా వర్ధంతికి మూడు రోజుల ముందు సినిమాను విడుదల చేయాలని అనుకోవడం యాదృచ్ఛికమైేని అన్నారు. వంవటీ తన డ్రీమ్ ప్రాజెక్టు అని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమాపై తన ఆలోచనను మార్చుకోనని అన్నారు. కేవలం సన్నివేశాల కారణంగా వివాదాలు పెంచుకునేంత మూర్ఖులు ఎవరూ లేరని అన్నారు.

వర్మను బలపరిచిన నెహ్రూ.

వర్మకు తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని నెహ్రూ మద్దతుగా నిలిచారు. సినిమాలో తనను ఎలా చూపించినా తనకు ఫరవా లేదని అన్నారు. సినిమాలు చూసి కొట్టుకునే స్థితి ప్రస్తుతం లేదని అన్నారు. సినిమాను ఎలాగైనా తీసుకునే సర్వహక్కులు దర్శకుడికి ఉన్నాయని ఆయన అన్నారు.

ఆయన రామ్ గోపాల్ వర్మ... అని నెహ్రూ అన్నారు. ఆయనకు కావాల్సింది బిజినెస్ అని కూడా అన్నారు. తాను సినిమాను చూడలేడని, తనకు ట్రైలర్స్ మాత్రమే చూపించారని అన్నారు.

రాజకీయాలకు రంగా కేంద్ర బిందువు

Vangaveeti-poster

గతంలో విజయవాడ రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా వర్మ ఈ సినిమాను వర్మ తెరకెక్కించారు. విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుండగా ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో రంగా హత్యకు గురయ్యారు.

వంగవీటి సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వంగవీటి రాధా, మరికొందరు హైకోర్టులో వేసిన పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది., ఈ సినిమాలోంచి 'కమ్మ కాపు' పాటను తీసేస్తామని కోర్టుకు సినిమా నిర్మాతలు నివేదించారు.

అయితే, దీంతో సంతృప్తి చెందని రాధా అభిమానులు శనివారం విజయవాడలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో జరగనున్న ఈ సినిమా ఆడియో విడుదల లోపు సినిమాను రాధా కుటుంబ సభ్యులకు చూపించి, ఆ తరువాత సెన్సార్‌కు పంపాలని డిమాండ్ చేశారు.

ఈ పరిస్థితిలోనే శనివారం ఉదయం నుంచి బెజవాడలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాధా కుటుంబ సభ్యులను కలిసి, తన ప్రయత్నాలను వాళ్లకు వివరించాలని నిశ్చయించుకున్న వర్మ విజయవాడ వచ్చీ రావడంతోనే వంగవీటి రంగా భార్య రత్నకుమారి, రంగా కుమారుడు రాధాకృష్ణతో భేటీ అయ్యాడు.

రాధా, రత్నకుమారిలతో భేటీ ముగిసిన తర్వాత వర్మ తన ట్విట్టర్‌లో సమావేశ వివరాలను ట్వీట్ చేశాడు. కొద్దిసేపటి క్రితమే రంగా కుటుంబ సభ్యులను కలిశానని, భేటీ సంతృప్తికరంగా జరగలేదని ట్వీట్ చేశాడు. సమస్యలున్నాయని, కానీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఏం జరుగుతుందో చూద్దామంటూ ట్వీట్ చేశాడు.

తాను ఇలాంటి సీరియస్ వార్నింగ్స్‌ చాలా చూశానని, కానీ నవ్వుతూ బెదిరించడం తొలిసారి చూశానని, ఇది చాలా ప్రమాదకరమని.. అయినప్పటికీ 'వంగవీటి' సినిమాపై వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశాడు.

ఇద్దరు మాత్రమే అభ్యంతరం...

Vangaveeti-Ram

ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, రంగా రాధా మిత్రమిండలికి చెందిన చాలా మంది సభ్యులు అండగా నిలుస్తున్నారని, వాళ్లను కూడా నేను ఆడియో ఫంక్షన్‌కు ఆహ్వానించానని ట్వీట్ చేశాడు.

విజయవాడ కాపు నేత వంగవీటి రంగా హత్యకు దారితీసిన పరిణామాలు, అంతకు ముందూ ఆ తరువాత జరిగిన పరిణామాలే 'వంగవీటి' సినిమా ఇతివృత్తం. సామాజిక వర్గాలు కూడా ప్రధానాంశంగా మారడంతో రాజకీయ వర్గాల్లో కూడా ఈ సినిమాపై చర్చ జరుగుతోంది.

English summary
The talks between Ram gopal varma and vangaveeti radhakrishna failed on Vangaveeti film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X