
మౌనం దేనికి? కొడాలి నానీని బర్తరఫ్ చెయ్యరేం.. క్యాసినో వ్యవహారంలో సీఎం జగన్ పై టీడీపీనేతల ఒత్తిడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ క్యాసినో వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తాజాగా గుడివాడ క్యాసినో వ్యవహారంపై మండిపడిన టీడీపీ నేతలు గుడివాడ క్యాసినో వీడియో ప్రదర్శిస్తూ కొడాలి నానీని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నేతలు వర్లరామయ్య, ధూళిపాళ్ళ నరేంద్ర, కొల్లు రవీంద్ర వైసీపీ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుని తేల్చుకుందాం.. కొడాలి నానీ సవాల్ ను స్వీకరించిన బోండా ఉమ!!

కొడాలి నానీని టార్గెట్ చేసిన ధూళిపాళ్ళ నరేంద్ర
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కొడాలి నానిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కొడాలి నాని ...చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి నాకు సంబంధంలేదంటే ఎలా? అంటూ మండిపడ్డారు .దొంగ పనులు చేయడం దొరికాక దబాయించడo వైసీపీ నేతలకు అలవాటే అంటూ ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బహిరంగంగా కేసును నిర్వహిస్తే సీఎం జగన్మోహన్ దేనికి సంకేతం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సీఎం జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ మౌనం చూస్తుంటే అనుమానం కలుగుతోందని ధూళిపాళ్ళ నరేంద్ర పేర్కొన్నారు.

మంత్రిని ఎందుకు బర్తరఫ్ చెయ్యలేదో చెప్పాలని ఆగ్రహం
ఇంతవరకు మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు అంటూ నిలదీశారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని కి సంబంధించిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించారని ఆరోపణల నేపథ్యంలో క్యాసినో నిర్వహణకు సంబంధించిన వీడియోను బయటపెట్టి కొడాలి నాని ని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి సహకారంతోనే ఈ క్యాసినో జరిగిందా? జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా? అలా మారుస్తుంటే ప్రతిపక్షం మౌనంగా ఉండాలా అంటూ ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నల వర్షం కురిపించారు.

బయటపెట్టిన ఆధారాలపై మంత్రి కొడాలి నాని సమాధానం చెప్పాలని డిమాండ్
తాము బయటపెట్టిన ఆధారాలపై మంత్రి కొడాలి నాని సమాధానం చెప్పాలని ధూళిపాళ్ళ నరేంద్ర డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాలలో ఇలాంటి ఆధారాలు కోకొల్లలుగా ఉన్నాయని వెల్లడించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. దీనికి సీఎం జగన్ సహకారం ఉందన్నది బహిరంగ సత్యం అని ధూళిపాళ్ళ నరేంద్ర తేల్చి చెప్పారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదు ఎందుకో: వర్ల రామయ్య
ఇదిలా ఉంటే గుడివాడలో వైసీపీ నేతలు జూదాలు, క్యాసినో నిర్వహించారని టిడిపి నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల క్యాసినో వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం జరిగిందని వర్ల రామయ్య తేల్చిచెప్పారు. గుడివాడలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడి చేస్తున్న పోలీసులు భద్రత కల్పించలేకపోయారు అని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డిజిపి స్పందించలేదని, డీజీపీని సంప్రదించిన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు వర్ల రామయ్య.

కొడాలి నాని ఆధ్వర్యంలోనే గుడివాడ భ్రష్టు
ఇక ఏపీని వైసీపీ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారని, గుడివాడలో క్యాసినో నిర్వహించిన విషయం పోలీసులకు తెలియదట అంటూ టిడిపి నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . పోలీసుల సమక్షంలోనే టిడిపి నేతలపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేశారని, అయినా పోలీసులు వారిని నిలువరించడంలో విఫలమయ్యారు అంటూ మండిపడ్డారు. కొడాలి నాని ఆధ్వర్యంలోనే గుడివాడ భ్రష్టు పట్టి పోయిందని కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.