• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెళ్తే వెళ్లొచ్చు: కొండ్రు వివాదాస్పదం, కిరణ్ ఆగ్రహం క్లాస్

By Srinivas
|

Kondru's words create furore: Kiran serious
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సోమవారం సాయంత్రం జరిగిన భేటీలో మంత్రి కొండ్రు మురళీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. మురళీ ఘాటైన వ్యాఖ్యలు చేయగా కిరణ్ ధీటాగా స్పందించి సీరియస్ అయ్యారు. మంత్రుల బృందానికి (జివోఎం)కు ఇవ్వాల్సిన నివేదికపై కిరణ్‌తో పలువురు సీమాంధ్ర మంత్రులు, నేతలు చర్చించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో కొండ్రు కూడా పాల్గొన్నారు.

ఓ సమయంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో ఉండే వారు ఉండవచ్చు వెళ్లే వారు వెళ్లవచ్చునని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని అంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో కిరణ్ ఘాటుగా స్పందించారు.

'పదవులు వస్తుంటాయి. పోతుంటాయి. పదవులు ముఖ్యం కాదు. ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మనపై ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న నిర్ణయంలో మార్పు లేదు. పార్టీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది. ఈ నిర్ణయాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బతికించాలని కోరుతున్నాం. అంతేతప్ప, ఇక్కడ ఉన్న వారంతా పార్టీకి విధేయులుగానే ఉన్నారు. నిర్ణయం మార్చుకోవాల్సింది కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రమే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఈ ఏడాది అగస్టు 3వ తేదీన చేసిన తీర్మానాన్నే మళ్లీ పంపుదాం'' అని కిరణ్ వ్యాఖ్యానించారు.

నలభై ఏళ్లుగా, తరాలుగా పార్టీలో ఎందరో ఉంటున్నారని అలాంటి వారు పార్టీ నిర్ణయంలో తప్పుంటే చెప్పినప్పుడు పార్టీ నుండి వెళ్లమని చెప్పడమేమిటని ప్రశ్నించారు. చాలామంది నేతలు ఏమైనా కాంగ్రెసు పార్టీలోనే ఉంటున్నారని, అలాంటి వారిని వెళ్లమని ఎలా చెబుతారన్నారు.

"రెండు మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలున్నారు. వారంతా పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. అయినా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే దానిని సరిదిద్దుకోవాలని.. రాష్ట్రంలో పార్టీని బతికించాలనే కోరుతున్నాం. అది తప్పంటే ఎలా!?'' అని ప్రశ్నించారు.

నేతల మండిపాటు

సమావేశంలో మురళీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యమంత్రి సహా మిగిలిన నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిందేనని అన్నారు. హోం శాఖ పంపిన లేఖకు సమాధానం ఇస్తే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించేందుకు వీల్లేదంటూ ఏక వాక్య తీర్మానం చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పారు.

ఈ సమయంలో మురళీ జోక్యం చేసుకుని పార్టీని బతికించకుండా నష్టపరిచే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. దీంతో ఇక్కడ ఉన్నవారెవరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని గాదె వెంకట రెడ్డి చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మాత్రమే అంటున్నామని, తప్పును దిద్దుకోవాల్సిందిగా సూచిస్తున్నామని చెప్పారు.

ఈ సమయంలో కోండ్రు మరోమారు మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కొండ్రును చుట్టుముట్టేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆగ్రహంతోనే.. "మురళీ.. బీ ఇన్ యువర్ లిమిట్స్. హద్దులు మీరవద్దు. చిన్నా పెద్దా తారతమ్యం చూడాలి. ఇక్కడున్న వారెవరూ పార్టీని ధిక్కరించడం లేదు. రెండు మూడు తరాలకు చెందిన కాంగ్రెస్ నేతలున్నారు. ఆరుసార్లు, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారున్నారు. వారిని గౌరవించడం నేర్చుకోవాలి'' అని గట్టిగానే చెప్పారట.

మళ్లీ ఆయన కొనసాగిస్తూ.. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రమే తన మాటను నిలబెట్టుకోవడం లేదన్నారు. సంప్రదాయాలను పాటించడం లేదని చెప్పారు. "తీర్మానాన్ని పంపుతామని చెప్పారు. తీర్మానాన్ని పంపకుండా ముసాయిదా బిల్లునే పంపుతామని అంటున్నారు. ఏది వచ్చినా దానిని ఓడించి పంపడమే ధ్యేయం'' అని కిరణ్ తేల్చి చెప్పారు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని మంత్రి రామచంద్రయ్య చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఉందని భావించిన కొందరు ఇతర పార్టీల్లో కర్చీఫ్‌లు వేసుకున్నారని అన్నారు.

English summary
Several Seemandhra ministers, senior MLAs including CM Kiran Kumar Reddy came down heavily on medical education ministers Kondru Murali for his remarks made at the meeting of Seemandhra Congress leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X