
సస్పెన్షన్ పై భగ్గుమన్న సుబ్బారాయుడు- రఘురామను కోట్ చేస్తూ- వైసీపీకి డెడ్ లైన్
ఏపీ వైసీపీలో కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యవహారం చిచ్చు రేపుతోంది. భీమవరం జిల్లా నరసాపురం నియోజకవర్గంలో స్ధానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో నెలకొన్న విభేధాల నేపథ్యంలో సుబ్బారాయుడుపై వైసీపీ అధిష్టానం నిన్న సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో అధిష్టానం చర్యపై సుబ్బారాయుడు ఇవాళ భగ్గుమన్నారు. ఇప్పటికే వైసీపీకి తలనొప్పిగా మారిన ఇదే నియోజకవర్గం ఎంపీ రఘురామరాజును కోట్ చేస్తూ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్
నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లిసుబ్బారాయుడు మధ్య నెలకొన్న విభేదాలు వైసీపీ కొంపముంచేలా ఉన్నాయి. ముఖ్యంగా నరసాపురం జిల్లా కేంద్రం విషయంలో తాజాగా స్ధానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో హోరాహోరీ పోరాడిన కొత్తపల్లి సుబ్బారాయుడు చివరికి వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రసాదరాజు మండిపడ్డారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో 24 గంటల్లోపే సుబ్బారాయుడిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసేసింది.

సస్పెన్షన్ పై సుబ్బారాయుడు ఫైర్
నరసాపురం వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తనపై వైసీపీ అధిష్టానం వేసిన సస్పెన్షన్ వేటుపై భగ్గుమన్నారు. ఇవాళ తన సస్పెన్షన్ పై స్పందించిన సుబ్బారాయుడు అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనపై సస్పెన్షన్ వేటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయని తనపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంత వరకూ సమంజసం అన్నారు.

రఘురామను గుర్తు చేస్తూ
వైసీపీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొత్తపల్లి సుబ్బారాయుడు గుర్తు చేశారు. అయినా తనపై సప్పెన్షన్ వేటు వేశారన్నారు. నరసాపురం రెబెల్ ఎంపీ రఘరామకృష్ణంరాజును సైతం ఈ వివాదంలోకి లాగారు. రఘురామపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదని ప్రశ్నించారు. తన ప్రత్యర్ధి, స్ధానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు సామాజిక వర్గానికే చెందిన రఘురామపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించడం ద్వారా ఆయన్ను సుబ్బారాయుడు పరోక్షంగా టార్గెట్ చేసినట్లయింది.

వైసీపీ హైకమాండ్ కు వార్నింగ్
తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని వైసీపీ అధిష్టానానికి సుబ్బారాయుడు నిలదీశారు. తన సస్పెన్షన్ కు గల కారణాల్ని సాయంతం లోగా చెప్పాలని డెడ్ లైన్ కూడా విధించారు. సరైన కారణం లేకుండా సస్పెండ్ చేస్తే చట్టవరంగా పోరాటం చేస్తానని కూడా సుబ్బారాయుడు హెచ్చరించారు. దీంతో సుబ్బారాయుడు కూడా రఘురామ తరహాలోనే వైసీపీకి ఇబ్బందులు సృష్టించబోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.