వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు షాక్, టిడిపిలోకి కొత్తపల్లి: నా పరిస్థితి ఏ సీఎంకు లేదు, కన్నెర్ర చేస్తే: బాబు భావోద్వేగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్. పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆయన అనుచరులు గురువారం రాత్రి టిడిపిలో చేరారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా కేంద్రం దగ్గరకు వెళ్లి మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని అడిగే పరిస్థితి రాలేదని, నాకు వచ్చిందన్నారు.

ఆయా రాష్ట్రాలు అలా అడిగే పరిస్థితి రాకపోవడానికి కారణం.. ఆ రాష్ట్రాలకు ఆర్థిక సంఘం ద్వారా న్యాయం జరిగిందని, అలాగే రాష్ట్ర విభజన జరగలేదన్నారు. తాను ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించానని చంద్రబాబు తెలిపారు.

Kothapalli Subbarayudu join Telugudesam

నేను కన్నెర్ర చేస్తే...

తమ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నేను మర్యాదగా ఉన్నంత వరకే వారి ఆటలు సాగుతాయని, నేను కన్నెర్ర చేస్తే ఇక ఆటలు సాగవని చంద్రబాబు హెచ్చరించారు. నా జీవితంలో భయమనేదే తెలియదని, నేను ఎప్పుడు తప్పు చేయనని చెప్పారు.

పదేళ్ల పాటు ప్రతిపక్షనేతగా ఉన్నానని, ఆ సమయంలో రాష్ట్రాభివద్ధికి ఎప్పుడూ అడ్డుపడలేదని, ప్రభుత్వానికి సహకరిస్తూనే మరింత అభివృద్ధి సాధించాలని ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు కొందరు నాయకుల మాటలు వింటుంటే బాధ కలుగుతోందన్నారు. ప్రజల కోసం వెనక్కిపోయే పరిస్థితి లేదని జగన్‌‍ను ఉద్దేశించి అన్నారు.

నా జీవితంలో రౌడియిజం అంటే ఏమీటో తెలియదని, 35 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, కుప్పంలో రౌడియిజం లేదని, నేను ఎప్పుడూ కుప్పం వెళ్లనని, అభివృద్ధి మాత్రమే చేస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలోనూ కుప్పం వెళ్లనని, కానీ అక్కడ ప్రజలు తన మీద నమ్మకంతో మంచి మెజార్టీతో గెలిపిస్తారన్నారు.

వారికి తన మీద ఉన్న నమ్మకం అది అన్నారు. కొంతమంది మూడు రోజు ధర్నాలు చేశారని పరోక్షంగా జగన్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనను అడిపోసుకుంటే ఓట్లు వస్తాయనే ఉద్దేశంలో వారు ఉన్నారని, అది వారికే రివర్స్ అవుతుందన్నారు. అలాంటి వారి గురించి మాట్లాడం వల్ల సమయం వృథా అవుతుందన్నారు.

కొంతమంది అనుభవం లేని వారు రాజకీయాల్లో వచ్చారని, అలాంటి వారికి అధికారం ఇస్తే ఆంధ్రాని అమ్మేస్తారని ప్రజలు భయపడి తనకు అధికారం అప్పగించారని వైసిపిపై మండిపడ్డారు. ఈ సమయంలో తన పైన ఎంతో బాధ్యత ఉందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్టాన్ని గట్టెక్కించాల్సిన అవసరం ఉందన్నారు.

కొత్తపల్లి సుబ్బారాయుడు స్ఫూర్తిగా అందరూ ముందుకు రావాలన్నారు. ఆయన రాకతో పశ్చిమ గోదావరిలో టీడీపీ ఇన్‌సైడ్‌గా గెలవడం తథ్యమన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్‌ సమయంలో పార్టీలో చేరానని, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు.

విజయవాడలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో జరిగిన కొత్తపల్లితో పాటు ఆయన సోదరుడు జానకి రామయ్య, జెడ్సీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

English summary
Former Minister Kothapalli Subbarayudu join Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X