సాయితేజ చివరి చూపు కోసం - డీఎన్ఏ పరీక్షలతో గుర్తిస్తేనే : ఇద్దరు చిన్నారులు- ఆవేదనతో ఊరు కన్నీరై..!!
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి రెండు రోజులు అయింది. కానీ, ఇంకా సాయితేజ భౌతికకాయం గుర్తించలేదు. ప్రమాదం ధాటికి గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో.. సాయి తేజ భౌతికకాయం స్వగ్రామమైన రేగడివారి పల్లెకు ఎప్పుడు వస్తోందో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. సాయితేజ తో పాటుగా అతని తమ్ముడు సైతం సైన్యంలోనే పని చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలూ ఆర్మీలోనే
రేగడివారి పల్లెకు చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులు తమ కంటిపాపలను దేశ సేవకు అంకితం చేశారు. గొప్పగా బతికే ధనధాన్యాలు లేకపోయినా.. దేశానికే రక్షణ కల్పించే తమ బిడ్డలను చూసి ఉప్పొంగిపోయారు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు సాయితేజ రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది. రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు తలలో నాలుకగా మెలుగుతూ అందరి ఆప్యాయత చూరగొన్నాడు.

ఊరంతా కన్నీటి సంద్రమై
అలాంటి తమ ఊరి ముద్దుబిడ్డ ఇకలేడంటే ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసి కన్నీరుకార్చని హృదయం లేదు. సాయితేజ స్థానికంగానే చదువుకున్నాడు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు.

రావత్ కు భద్రతాధికారిగా
చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటయ్యాక తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తూ విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక, ప్రమాదం తరువాత మృతదేహాలు గుర్తు పట్టని విధంగా ఉండడంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపుకు ఆర్మీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గత రాత్రి ఆర్మీ బృందం సాయి తేజ ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, పిల్లల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేయాలి అంటే ఒకటి, రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. డీఎన్ఏ పరీక్షలు వీలుకాని పక్షంలో సాయి తేజ శరీరంపై ఉన్న గుర్తుల ద్వారా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఆలోచనలో ఆర్మీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

చివరి చూపు దక్కేనా.. ఆ బిడ్డలను చూసేదెవరు
ఇదే విషయంపై అధికారులు సాయితేజ బంధువుల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. అవసరమైతే ఢిల్లీకి కుటుంబ సభ్యులను రావాలని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు విన్నవించారు. అయితే తాము వచ్చే పరిస్థితి లేదని శరీరంపై ఉన్న గుర్తుల ఆనవాళ్లకు సంబంధించిన క్లోజ్ అప్ ఫోటోల ద్వారా తెలియ పరిచేస్తే గుర్తుపట్టగలమని సాయి తేజ తమ్ముడు మహేష్ బాబు అధికారులకు స్పష్టత ఇచ్చారు. దీంతో.. సాయితేజ డెడ్ బాడీ ఎప్పుడు అప్పగిస్తారు.. చివరి చూపులు అయినా దక్కుతాయా అనే ఆవేదన ఆ గ్రామంలో కనిపిస్తోంది. అయితే, డెడ్ బాడీ వస్తే ఖననం చేయటానికి వీలుగా రెవిన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరంతా కదిలి ఇప్పుడు సాయితేజ భౌతిక కాయం కోసం నిరీక్షిస్తున్నారు.