అమరావతికి ఆహ్వానం: భూముల కేటాయింపులు జరిగిన 6 సంస్ధలివే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆరు ప్రభుత్వ ప్రైవేట్ విద్య, వైద్య సంస్ధలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో సంస్థలను నెలకొల్పాలని ప్రముఖ సంస్థలకు సీఎం చంద్రబాబు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన 11 సంస్థలు అమరావతిలో తాము కార్యకలాపాలను చేపడతామంటూ దరఖాస్తు చేసుకున్నాయి. ఆ దరఖాస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. పూర్తిస్థాయి అధ్యయన బాధ్యతను మెకెన్సీ సంస్థకు అప్పగించింది.

మెకెన్సీ అధ్యయన నివేదికను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. ప్రతిపాదనలు పంపిన 11 సంస్థల్లో 6 సంస్థలు తమ కార్యకలాపాలను సాగించేందుకు వీలుగా భూ కేటాయింపులు చేసేందుకు కమిటీ ఆమోదముద్ర వేసింది.

ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌):
ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌) సంస్ధకు 150 ఎకరాలను ఎకరా రూ.50 లక్షల చొప్పున కేటాయిస్తారు. ఈ ఆసుపత్రిలో అమరావతి ప్రాంతవాసులకు 20 శాతం పడకలను ఉచితంగా అందించాలి. అమరావతి నగర పరిధిలోని ప్రాథమిక ప్రజారోగ్య కేంద్రాల సామర్థ్యాల పెంపు, సేవలలో వృద్ధి, నాణ్యమైన సేవలు అందించేలా ఐయూఐహెచ్‌ సహకారం అందించాలి.

అమరావతి ప్రాంతంలో ఆ సంస్థ అంబులెన్స్‌ సేవలను అందించాలి. మొదటి దశ లక్ష్య సాధనపై సీఆర్‌డీఏ సమగ్ర సంప్రదింపులు జరిపి.. ఐయూఐహెచ్‌ పనులపై సంతృప్తి చెందాకే.. రెండో విడత భూ కేటాయింపులు చేయాలి. ఈ భూములను ఆ సంస్ధకు పూర్తి హక్కులతో (ఫ్రీహోల్డ్) విక్రయిస్తారు.

lands allotted to private companies in amaravati


వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌):
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌)కు ఎకరా రూ.50 లక్షల చొప్పున రెండు విడతల్లో 200 ఎకరాలు కేటాయించారు. మొదటి దశ ఐదేళ్లు పూర్తయ్యే నాటికి 100 ఎకరాల్లో నిర్మించే విద్యా భవన సముదాయంలో డీపీఆర్‌లో పేర్కొన్న విధంగా 18,000 మంది విద్యార్థులు చేరాలి.

మొదటి దశ లక్ష్యాలు సాధించాకే రెండో దశ 100 ఎకరాలు కేటాయించాలి. మొదటి దశలోనే ఉన్నత విద్యామండలి నిపుణుల బృందం అధ్యయన నివేదిక మేరకు.. కోర్సుల వివరాలు, విద్యాభ్యాసం పూర్తి చేశాక పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగావకాశాలు పరిశీలిస్తారు. ఈ సంస్ధకు పూర్తి హక్కులతో (ఫ్రీహోల్డ్) విక్రయిస్తారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్ధకు 50 ఎకరాలను లీజు ప్రాతిపదికన ఉచితంగా ఇస్తారు.

ఏపీ మానవ వనరుల సంస్ధ
ఏపీ మానవ వనరుల సంస్ధకు రాజధాని ప్రభుత్వ భవనాల సముదాయంలో 25 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్ధకు లీజు ప్రాతిపదికన ఉచితంగా భూమి ఇస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 25 ఎకరాల్ని ఎకరా రూ. 50 లక్షల చొప్పున కేటాయిస్తారు.

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్ధకు 5 ఎకరాలను లీజ ప్రాతిపదకిన ఉచితంగా ఇస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
lands allotted to private companies in amaravati By government of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి