జగన్ పైనా చంద్రబాబు తరహా గేమ్-సీబీఐ వార్నింగ్స్ మొదలు-పవన్ కోరుతున్నట్లే- 2014 సీన్ రిపీట్ ?
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. గతంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా సహా పలు హామీల్ని పదే పదే అడుగుతున్న సమయంలో చంద్రబాబుపై అవినీతి పేరుతో ఎదురుదాడి ప్రారంభించిన బీజేపీ.. చివరికి ఆయనపై అవినీతిపరుడిగా ముద్ర వేసి దూరం చేసేసింది. ఈ క్రమంలో తమకు పరోక్షంగా మద్దతునిచ్చిన జగన్ కు అండగా ఉన్నట్లు నటిస్తూ ఇన్నాళ్లు వాడుకున్న బీజేపీ. ఇప్పుడు ఆయన్ను కూడా గతంలో చంద్రబాబును చేసినట్లే టార్గెట్ చేయడం మొదలుపెడుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ ఇచ్చే క్రమంలో బీజేపీ దూకుడు పెంచిందా అన్న చర్చ మొదలైంది.

జగన్ పై బీజేపీ మోజు తీరిందా ?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ గత మూడేళ్లుగా కేంద్రంలో బీజేపీ అడిగినవి, అడగనివి కూడా చేసిపెట్టారు. కేంద్రానికి ఎన్డీయే మిత్రపక్షాలను మించి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు అందించారు. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా కేంద్రం చెప్పిందని పలు పథకాల్ని రుద్దేందుకు జగన్ సిద్ధమైపోయారు. నాలుగు వేల కోట్లకు కక్కుర్తి పడి కేంద్రం చెప్పినట్లు రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు జగన్ పై చేసిన ఆరోపణ కేంద్రం చెప్పుచేతల్లో జగన్ ఎలా పని చేస్తున్నారో గుర్తుచేసింది. మరి ఇంతగా మద్దతునిస్తున్న జగన్ విషయంలో కేంద్రం ఎలా వ్యవహరించాలి, కానీ ఎలా వ్యవహరిస్తోందనేది గమనిస్తే వైసీపీ అధినేతపై కేంద్రం మోజు తీరిపోయినట్లే అర్ధమవుతోంది.

జగన్ పై సీబీఐ విచారణ హెచ్చరికలు
ప్రస్తుతం సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ను గతంలో యూపీఏ సర్కార్ హయాంలో హైకోర్టు ఆదేశాల మేరకు నమోదైన అక్రమాస్తుల కేసు వేధిస్తోంది. దీనికి తోడు వైఎస్ కుటుంబంపై వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎప్పుడు కొరడా ఝళిపిస్తుందో తెలియని పరిస్ధితి. వీటికి తోడు ఇప్పుడు కేంద్ర నిధుల్ని సొంత అవసరాలకు వాడుకుంటున్న వ్యవహారంపైనా సీబీఐ విచారణ చేయిస్తామని కేంద్రమంత్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదీ ఏపీకి వచ్చి మరీ వార్నింగ్స్ ఇచ్చి వెళ్తున్నారు. ఢిల్లీ నుంచి కూడా ఇవే హెచ్చరికలు, ఏపీ బీజేపీ నేతలు కూడా సేమ్ వార్నింగ్స్ ఇస్తున్నారు.

గతంలో చంద్రబాబుకూ ఇలాగే
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని, ప్రజల్ని ఒప్పించి మరీ కేంద్రానికి మద్దతుగా ఉన్న చంద్రబాబును కూడా ఎన్నికల అవసరాలతో బీజేపీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ముందుగా రాష్ట్రంలో బీజేపీ నేతలతో ఆరోపణలు చేయించడం మొదలుపెట్టిన కాషాయ దళం.. ఆ తర్వాత ప్రధాని, అమిత్ షా వరకూ అవే ఆరోపణల్ని తీసుకెళ్లింది. కేంద్రాన్ని టీడీపీ వదిలివెళ్లిపోయాక ఈ పోరు మరింత తీవ్రతరం చేయడంతో పాటు ఎన్నికల్లో సైతం కేంద్ర సంస్ధల సాయంతో టీడీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేసింది. దీంతో చంద్రబాబు కేంద్రం సహకారం లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటమిపాలైనట్లు ఇప్పటికీ చెప్తుంటారు.

కరివేపాకులా వాడుకుని వదీలేస్తూ
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీకి ఏపీ ఎంతో భిన్నం. ఇప్పటివరకూ ఏపీలో టీడీపీ మద్దతు లేకుండా బీజేపీ కనీస ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు కూడా గెల్చుకోలేదు. అటు వైసీపీ మాత్రం బీజేపీ నుంచి ఒక్క ప్రజాప్రతినిధిని గెలిపించేందుకు కూడా సాయం చేయలేదు. దీంతో ఇక్కడ అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల్ని తమ అవసరాలకు వాడుకుని వదిలేయడం బీజేపీకి అలవాటుగా మారిపోయింది. గతంలో చంద్రబాబును, ఇప్పుడు జగన్ ను కూడా అలాగే తమ అవసరాలకు వాడుకున్న కాషాయ నేతలు.. అవి తీరిపోయాక మాత్రం కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

పవన్ అడిగిన రోడ్ మ్యాప్ ఇదేనా ?
కొన్ని రోజుల క్రితం ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ పార్టీని 2024 ఎన్నికల కోసం మీ రోడ్ మ్యాప్ ఏంటని అడిగారు. ఇప్పుడు బీజేపీ ఆ రోడ్ మ్యాప్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ కేంద్రంలో రాజకీయ అవసరాల కోసం, రాజ్యసభలో బిల్లుల కోసం, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం వైసీపీని వాడుకుంటూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో విజయాలతో ఆ అవసరం కూడా లేకుండాపోయింది. దీంతో తమకు అవసరం లేని జగన్ పై యుద్ధ భేరి మోగించి విపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి 2024 ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో 2014లో సరిగ్గా ఇలాంటి కూటమే ఏర్పాటు చేసి లబ్ది పొందిన బీజేపీ.. ఇప్పుడు మరోసారి అదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు పవన్ కు సంకేతాలు పంపుతోంది.