గుంటూరులో సోషల్ పోస్టుల రచ్చ-రఘురామ సీన్ రిపీట్ ? సీఐడీ దాడి ఆరోపణలతో మెడికల్ టెస్టులు
గుంటూరులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు పోస్టులు పెట్టిన వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ కేసులో సీఐడీ అరెస్టు చేసిన నిందితులు బెయిలి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైకోర్టు విచారణలో వారు తమపై కస్టడీలో సీఐడీ అధికారులు దాడి చేశారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ సందర్భంగా అధికారులు తమపై దాడి చేసినట్లు సోషల్ మీడియాపోస్టుల వ్యవహారంలో అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలు ఇద్దరూ ఆరోపించారు. దీంతో స్ధాని కోర్టు జడ్డి వారిని వైద్య పరీక్షలకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వెంకటేష్ కు నేడు జిజిహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో సీఐడీ వెంకటేష్ ను నిన్న రాత్రి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు.. అనంతరం వైద్య పరీక్షలకు తరలించారు.

సిఐడి పోలీసులు తనను కొట్టారని నిందితుడు గార్లపాటి వెంకటేష్ జడ్జి వద్ద చెప్పాడు. దీంతో వెంకటేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు.వైద్యుల నివేదిక తరువాత వెంకటేష్‌ను కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. సోషల్ మీడియా పోస్టుల కేసులు వెంకటేష్ సాంబశివరావును నిన్ననే అరెస్టు చేసిన సిఐడి పోలీసులు.. తదుపరి విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వా్తవానికి ఇదే కేసులో నిన్నంతా వెంకటేష్, సాంబశివరాలను సిఐడి పోలీసులు విచారించారు. విచారణ తర్వాత సాంబశివరావుకు నోటీసులు ఇచ్చి పంపించిన సిఐడి పోలీసులు.. వెంకటేష్ పై మాత్రం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు విషయంలోనూ సీఐడీ పోలీసులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో దాడి నిజమేనని తేలింది. దీంతో ఏపీ సీఐఢీ పోలీసులు ఆభాసుపాలయ్యారు. ఇప్పుడు దాదాపు అలాంటి ఆరోపణలే ఈసారి సోషల్ మీడియా పోస్టుల కేసులో నిందితులు కూడా చేయడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.