• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కీలక దశలో ఏపీ- ఎన్నడూ లేనంత అనిశ్చితి- ప్రభుత్వ నిర్ణయాలపై ఉత్కంఠ..

|

ఏపీలో ఓవైపు కరోనా మహమ్మారి తరుముతోంది. మరోవైపు కీలక నిర్ణయాలు పెండింగ్ లో ఉండిపోయాయి. వీటిపై ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది. మే నెల దాటిపోతే వీటిలో కొన్ని నిర్ణయాలు నిరవధిక వాయిదా వేసుకోక తప్పని పరిస్ధితి. ఇలాంటి కీలక సమయంలో ఎన్నడూ లేనంత అనిశ్చితి ఎదుర్కొంటున్న రాష్ట్రానికి సీఎం జగన్ ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 కీలక నిర్ణయాలన్నీ పెండింగ్..

కీలక నిర్ణయాలన్నీ పెండింగ్..

ఏపీలో ప్రస్తుతం రాజధాని తరలింపు, స్ధానిక సంస్ధల ఎన్నికలు, ఇంగ్లీష్ మీడియం అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి భవితవ్యం... ఇలా చెప్పుకుంటూ పోతే డజనుకు పైగా నిర్ణయాలు అమలు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవే. వీటిలో ఏ ఒక్కటి అమలు కాకపోయినా ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి తప్పదు. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో వీటి అమలుకు ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకోలేని పరిస్ధితి నెలకొంది. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా రాష్ట్రం ప్రస్తుతం లాక్ డౌన్ లోనే ఉంది. ఇప్పట్లో రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా సడలించలేని పరిస్ధితి. దీంతో ప్రభుత్వ నిర్ణయాల అమలు నిరవధిక వాయిదా తప్పదా అన్న ఆందోళన మొదలైంది.

 ఎన్నడూ లేనంత అనిశ్చితి...

ఎన్నడూ లేనంత అనిశ్చితి...

గత కొన్ని దశాబ్దాల్లో ఏపీలో ఇంత మెజారిటీ కలిగిన ప్రభుత్వం ఎన్నడూ లేదు. అయితే మెజారిటీలో ఉన్నా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం కూడా లేదు. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడే వాటికి సంబంధించి సుదీర్ఘ కసరత్తు చేసేవి. కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వాన్ని గమనిస్తే తాము అనుకున్న విధంగా నిర్ణయాలు తీసేసుకుని వాటి అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. అలాగని గతంలో పనిచేసిన మిగతా ముఖ్యమంత్రుల్లా సీఎం జగన్ కు రాజకీయ అనుభవం కానీ, పాలనా అనుభవం కానీ లేవు. ఓ దశలో జగన్ ను నడిపిస్తున్నదెవరు అన్న ప్రశ్నలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. కానీ ఓసారి అధికారం చేపట్టాక సాకులు చెప్పడం కుదరదు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోతే అనిశ్చితి తప్పదు.

సకాలంలో పూర్తి కాకపోతే...

సకాలంలో పూర్తి కాకపోతే...

ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వాటిని సకాలంలో అమలు చేయడమూ అంతే ముఖ్యం. ఉదాహరణకు రాజధాని తరలింపు, ఇంగ్లీష్ మీడియం అమలు వంటి నిర్ణయాలపై ఏదో ఒకటి తేల్చుకోకపోతే... మే నెల తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఇబ్బందులు తప్పవు. ఇక వాటిని వచ్చే విద్యాసంవత్సరానికి వాయిదా వేసుకోవాల్సిందే. శాసనమండలి రద్దు కూడా ఇదే కోవలోకి వస్తుంది. నిర్ణీత సమయంలో కేంద్రం ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియ పూర్తి చేయకపోతే రాబోయే ప్రతీ అసెంబ్లీ సమావేశాల్లోనూ మండలి నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలపై ప్రభుత్వం వెనువెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు.

 అన్నింటికీ జగనే....

అన్నింటికీ జగనే....

దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో రాజకీయాన్ని వంట బట్టించుకుని భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన ఘనత జగన్ ది. ఇప్పటికీ వైసీపీతో పాటు ప్రభుత్వానికి జగన్ దిక్కు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరూ జగన్ వైపు చూడాల్సిందే. దీంతో రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్ధితుల్లోనూ ప్రభుత్వం, పార్టీ కూడా జగన్ వైపే చూస్తోంది. భారీ అంచనాల మధ్య అధికారం చేపట్టిన జగన్ కు ఈ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే విషయంలోనూ అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి రాబోయే నెల రోజుల్లో జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమే. కాబట్టి అందరి చూపూ జగన్ వైపే ఉంది.

 జగన్ పై ఒత్తిడి..

జగన్ పై ఒత్తిడి..

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే రాజధాని, స్ధానిక సంస్ధల ఎన్నికలు, ఇంగ్లీష్ మీడియం సహా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. ఇందులో సక్సెస్ అయితే సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. సంక్షోభాలను కూడా దాటుకుంటూ అనుకున్న విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారనే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రభుత్వ సమర్ధతపై ప్రశంసలు వస్తాయి. కానీ విఫలమైతే మాత్రం జగన్ పతనం కోసం ఎదురుచూస్తున్న విపక్ష పార్టీలన్నీ కలిసి మూకుమ్మడిగా విరుచుకుపడతాయి. పది మంది పదిసార్లు చెబితే ప్రజలు కూడా అదే నిజమని భావించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి సీఎం జగన్ పై ఆ మేరకు ఒత్తిడి నెలకొంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం అంచున నిలిచిన ఏపీకి ప్రస్తుతం జగన్ పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి చరిత్రలో నిలిచిపోతారా ? లేక విమర్శల పాలవుతారా అన్నది రాబోయే రెండు నెలల్లో తేలిపోతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
andhra pradesh govt is facing critical situation as capital city shifting, local body election postponement and other key issues are at pending stage. hence, all eyes on cm jagan's capabilities to come out of the situation at the earliest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X