అంబులెన్సుల నిర్వహణ ఏ2 సాయిరెడ్డి అల్లుడుకి కట్టబెట్టిన తర్వాతే ఈ దారుణాలు: లోకేష్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రులలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశామని, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో ఒక కుటుంబం పై తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూసి షాక్ అయ్యామని పేర్కొన్న లోకేష్ నెల్లూరు జిల్లా ఉదయగిరి లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేసిన ఘటనపై మండిపడ్డారు.
రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని లోకేష్ విమర్శించారు. నెల్లూరు జిల్లా సంగంలో నీట మునిగి శ్రీరామ్ అనే బాలుడు మరణించాడని, కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఆసుపత్రి వద్ద ఉన్న 108 వాహనాన్ని అడిగితే నిబంధనలు ఒప్పుకోవు అన్నారని పేర్కొన్న లోకేష్ దాంతో తండ్రి చనిపోయిన కొడుకు ను బైక్ మీద మీద తీసుకెళ్లాల్సిన పరిస్థతి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వేళ మహాప్రస్థానం వాహనాలు ఏమయ్యాయి? అంటూ లోకేష్ ప్రశ్నించారు.

ఆప్తుల చావును కూడా రాజకీయాలకు వాడుకునే పాలకులకు కుటుంబ అనుబంధాల గురించి తెలియకపోవడం వల్లే ఏపీలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి అంటూ లోకేష్ పేర్కొన్నారు. రుయా ఘటన మరచిపోక ముందే కొడుకు మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాల్సి వచ్చిన మరో ఘటన నెల్లూరు జిల్లా సంగంలో జరిగిందని తెలిపిన లోకేష్ బిడ్డని కోల్పోయిన బాధలో ఉన్న తండ్రి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వేడుకున్నా ఆస్పత్రి సిబ్బంది మానవత్వంతో స్పందించకపోవడం దారుణం అంటూ మండిపడ్డారు. ఎవరు సహాయం చేయని దయనీయమైన స్థితిలో బైక్ పైన కొడుకు శ్రీరామ్ మృతదేహాన్ని తండ్రి తరలించారని వెల్లడించారు.
పబ్లిసిటీ పిచ్చితో మీరు జెండా ఊపిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి గారు అంటూ లోకేష్ జగన్ ను ప్రశ్నించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వాసుపత్రులు ఘోరమైన పరిస్థితులకు అద్దం పడుతున్నాయని లోకేష్ వెల్లడించారు. అంబులెన్స్ నిర్వహణ మీ ఏ 2 సాయి రెడ్డి అల్లుడుకి కట్టబెట్టిన తర్వాతే ఈ దారుణాలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. ఈ అమానుష ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా అంటూ లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.