లోకేష్ నామినేషన్ పెండింగ్ : 24 గంటల సమయం : టిడిపి లో టెన్షన్..!
టిడిపి లో కొత్త టెన్షన్. తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న చంద్రబాబు తనయడు లోకేష్ దాఖలు చేసిన నామి నేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మంగళగిరి నుండి లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు .దీనిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి నోటరీ పై అభ్యంతరం వ్యక్తం చేసారు. సమస్య పరిష్కరానికి 24 గంటల టైం ఇచ్చారు. దీని పై ఉత్కంఠ నెలకొని ఉంది.
లోకేశ్ నామినేషన్ పై అభ్యంతరం
సీఎం చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ పేపర్లలో తప్పిదం కారణంగా లోకేష్ నామినేషన్ ఆమోదం పొందుతుందో లేదోనని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లోకేష్ ఇంటి అడ్రస్‌ను తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నారు. దీనిని కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ సీతారామ్ నోటరీ చేశారు.అయితే, తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. వివరణ ఇచ్చేందుకు లోకేష్ తరపు న్యాయవాది సీతారామ్ కొంత సమయం కావాలని రిటర్నింగ్ అధికారి వసుమా బేగంను కోరారు.

24 గంటల సమయం..
ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో రిటర్నింగ్ అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దాఖలు చేసిన నామి నేషన్ చెల్లదంటూ అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ లో భాగంగా నారా లోకేశ్ సమర్పించిన కృష్ణా జిల్లా నోటరీ గుంటూరు జిల్లా మంగళగిరిలో చెల్లదని అధికారులు అభ్యంతరం తెలిపారు. నోటరీ చట్టంలోని సెక్షన్-9 ను ఈ సంద ర్భంగా అధికారులు ఉదహరించారు. అయితే, సరైన పత్రాలు సమర్పించేందుకు నారా లోకేశ్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి 24 గంటలు గడువు ఇచ్చారు. రేపు మధ్నాహ్నం లోగా రిటర్నింగ్ అధికారి కోరిన విధంగా మార్పులు చేసి తిరిగి నామినేష్ ను అందించేందుకు సమయం ఇవ్వటంతో టిడిపి నేతలు ఊపిరి పీల్చుకున్నారు.