ఆ జీవోలు వారికి శాపం.. మీకు ఓట్లేయటమే వారి పాపమా; జగన్ కు లోకేష్ బహిరంగలేఖ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు అంటూ నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు. గిరిజనులకు సంక్షేమపథకాలు దూరం చేసే అడ్డగోలు నిబంధనలు సవరించి ..ఆపేసిన పెన్షన్, రేషన్, సంక్షేమపథకాలు పునరుద్దరించాలని సీఎం వైయస్ జగన్ కు లేఖ రాసిన లోకేష్ మీకు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా?అంటూ జగన్ ను నిలదీశారు.

ఆదివాసీలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డగోలు నిబంధనలు
అడ్డగోలు నిబంధనలతో ఆదివాసీలకు సంక్షేమపథకాలు అందకుండా దూరం చేయడం మీకు న్యాయమా? అంటూ ప్రశ్నించారు లోకేష్. తలకు మించిన అప్పులతో సంక్షేమపథకాలు కోత వేయాలనే ఆలోచనతో కనీస అధ్యయనం లేకుండా మీరు తెచ్చిన నిబంధనలు వేలాదిమంది గిరిజనుల జీవనాధారమైన పింఛను, రేషన్ని దూరం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరక్షరాస్యులైన గిరిజనులు తమకు రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వలేదో, పింఛన్ ఎందుకు ఆపేశారో తెలియక కొండలపై నుంచి ఆకలితో, ఆవేదనతో కుంగిపోతున్నారు అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనుల కన్నీటి కష్టాలపై పత్రికలలో కథనాలు వచ్చినా మీరు సరిదిద్దే చర్యలు తీసుకోకపోవడం ఆదివాసీల పట్ల మీ చిన్నచూపుని ఎత్తు చూపుతోందని లోకేష్ విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ కు గిరిజనుల కోసం బహిరంగ లేఖ రాసిన లోకేష్
సీఎం జగన్మోహన్ రెడ్డి కి నారా లోకేష్ రాసిన బహిరంగ లేఖలో సంక్షేమ పథకాలు కోత వెయ్యాలనే హిడెన్ అజెండాతో పది ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, వాహనం ఉంటే వారికి సంక్షేమ పథకాలు వర్తించవని, వారు సంక్షేమ పథకాలకు అనర్హులని మీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు ఆదివాసీల పాలిట శాపంగా మారాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ నిబంధనను ఆదివాసీలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లోని క్లాజ్ 6 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియా లో ఉంటున్న గిరిజనులకు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, గిరిజనేతరులకు హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విస్మరించి మైదాన ప్రాంతాల లబ్ధిదారులకు ఉద్దేశించిన నిబంధనలే, షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకు విధించడంతో వేలాదిమంది పింఛన్ ఆసరా కోల్పోయారని నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ జీవోతో గిరిజనులకు నష్టం ఎలా జరుగుతుందో చెప్పిన లోకేష్
రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకానికి అనర్హులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభుత్వ జీవో లో గిరిజనులకు నష్టం చేకూర్చే అంశాలను ప్రస్ఫుటంగా వెల్లడించిన లోకేష్ మైదాన ప్రాంతంలో పది ఎకరాలు ఉంటే తక్కువలో తక్కువ కోటి రూపాయలు విలువ చేస్తుందని, అదే ఆదివాసీల పేరుతో ఎన్ని ఎకరాలు ఉన్న దాన్ని అమ్మడానికి, కొనడానికి వీల్లేదని, ఇక కొండ ప్రాంతాల్లో పండే పంటలు కూడా పెద్దగా ఏమీ ఉండవని లోకేష్ పేర్కొన్నారు. అంతేకాదు గిరిజనులు తాము సాగు చేయడం ద్వారా సంవత్సరానికి గరిష్టంగా 25 వేల రూపాయలకు మించి సంపాదించరని లోకేష్ స్పష్టం చేశారు. ఏజెన్సీలో ఆదివాసీలకు పది ఎకరాల భూమి ఉన్నా అందులో సాగయ్యే 1 నుంచి 3 ఎకరాల భూమి మాత్రమేనని పేర్కొన్న లోకేష్ కేవలం 25 వేలు సొమ్ముతో ఆదివాసీలు ఎలా బ్రతకాలో చెప్పాలని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో ఎలాంటి కొర్రీలు లేకుండా వారికి పథకాలు
గిరిజనులకు భూమి ఉందని వారిని సంక్షేమ పథకాలను దూరం చేయడం, వారికి ఇచ్చే పింఛన్, రేషన్ లను పీకేయ్యటం అన్యాయం కాదా అంటూ ప్రశ్నించిన లోకేష్ గిరిజనుల నోటి కాడ కూడు లాక్కుంటున్నారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆదివాసీలందరికీ ఎటువంటి కొర్రీలు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని కానీ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదివాసీలను సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు.

మీ నిబంధనలతో గిరిజనులకు తీరని నష్టం .. ఎలా బ్రతకాలని ఆదివాసీల ఆవేదన
ఇక గిరిజన కుటుంబాలలో పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులను వదిలి మైదాన ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని, ఇక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉన్న కారణంగా సంక్షేమ పథకాలను ఆపేయడం ఏ విధంగానూ భావ్యం కాదని లోకేష్ జగన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అనే కారణంతో సంక్షేమ పథకాలు ఆపేశారని కొండలపై నిరుపేద గిరిజనులు ఎలా బ్రతకాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు లోకేష్. అంతేకాదు 300 యూనిట్లు విద్యుత్ వాడకం దాటిన వాళ్ల పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామని గిరిజనుల సంక్షేమ ఫలాలను తొలగించటం దారుణమన్నారు. పక్కా ఇళ్లు కట్టించి ఇస్తే ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పది వేలు కట్టాలి అని చెప్పడం దుర్మార్గమైన చర్య అని లోకేష్ మండిపడ్డారు.

నిరక్షరాస్యులైన ఆదివాసీలను అనర్హులను చేసే నిర్ణయాలు మార్చుకోవాలి
భూమి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 యూనిట్లు దాటిన కరెంటు బిల్లు, కుటుంబంలో వారికి ద్విచక్ర వాహనాలు మాత్రమే కాదు, సచివాలయంలో వివరాలు అప్డేట్ చేసుకోని కారణంగా కూడా గిరిజనులకు సంక్షేమ పథకాలు అందకుండా చేశారని దీంతో ఆదివాసీలు ఆకలితో అలమటిస్తున్నారు అని, గిరిజనులు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు అని లోకేష్ మండిపడ్డారు. మీరు అందుబాటులోకి తెచ్చిన సచివాలయాలే గిరిజనులను సమస్యల్లోకి నెడుతుంది అని లోకేష్ పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు సంక్షేమ పథకాల అర్హత నిబంధనలను అనుసరించి కొత్త జీవోలను ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని నిరక్షరాస్యులైన ఆదివాసీలను అనర్హులను చేసే అనాలోచిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, రికార్డుల్లో తప్పుగా నమోదైన భూముల వివరాలను సరిచేయాలని లోకేష్ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.