శ్రీనివాస వైభవం: 16 నుంచి బ్రహ్మోత్సవాలు, 9 రోజుల్లో 16 వాహన సేవలు
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. రేపు శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నెల 16 నుంచి 24 వరకు శ్రీవారి బ్రహోత్సవాలు జరగనున్నాయి. 9 రోజులు పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు 16 వాహన సేవలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ ఏడాది స్మామి వారి బ్రహ్మోత్సవాలను టీటీడీ రెండు సార్లు నిర్వహించనుంది. అందుకు కారణం ఈ అధికమాసం రావడమే. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. కాబట్టి ఈ ఏడాది టీటీడీ రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది.

దసరా సమయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. మంగళవారం సాయంత్రం సమయంలో శ్రీవారి సేనాధిపతులైన శ్రీవిష్వక్సేనులవారు ఆలయానికి నైరుతి వైపున ఉన్న వసంత మండపానికి ఛత్రచామర మంగళ వాద్యపురస్సరంగా వేంచేస్తారు.
అనంతరం భూమి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివారు మృత్సంగ్రహణం చేసి ప్రదక్షిణంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. దీంతో రేపు రాత్రికి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల మధ్య మకరలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది.
ఈ ఘట్టంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను రాత్రి 8.15 గంటలకు సమర్పిస్తారు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి పెద్దశేష వాహనసేవ జరుగుతుంది. తిరుమలలో స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురుస్కరించుకుని పాపవినాశనం తీర్ధం కళ్యాణవేదిక సమీపాన గల ప్రదర్శనశాల వద్ద సైకిత శిల్పం రూపుదిద్దుకొంటోంది.
మైసూరుకి చెందిన కళాకారులు గౌరి, నీలాంబిక దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఆనందనిలయ విమాన వేంకటేశ్వర స్వామివారిని వైకుంఠం నుంచి భూలోకంలోకి తీసుకువస్తున్న గరుడు రూపం రూపొందించారు.