
ఇంకా దొరకని బందరు మత్సకారుల ఆచూకీ-ఆందోళన-సీఎస్ కు చంద్రబాబు లేఖ
ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చేపల వేటకు వెళ్లిన మత్సకారులు గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. మచిలీపట్నం నుంచి చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్సకారుల జాడ ఇంతవరకూ లభించలేదు. ఇప్పటికే వారి తోటి మత్సకారులు సైతం సముద్రంలోకి వెళ్లి గాలించి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అధికారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై వెంటనే స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు.
మచిలీపట్నం నుంచి మూడు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్సకారుల కోసం ఇవాళ కోస్టా గార్డ్ బృందాలు రంగంలోకి దిగాయి. వీరితో పోలీసు, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్ అధికారులు సమన్వయం చేసుకుని గాలింపు చేపట్టారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం మచిలీపట్నం నుంచి అంతర్వేది వరకూ ఉన్న తీరంలో మత్సకారుల కోసం గాలింపు సాగుతోంది.మరోవైపు వేటకు వెళ్లిన జాలర్ల బోటు అంతర్వేదికి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయినట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే వెళ్లి చూసే సరికి బోటు కనిపించలేదు. దీంతో తోటి మత్సకారుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత గల్లంతైన మత్సకారుల కుటుంబాల్లోనూ ఆందోళన పెరుగుతోంది.

మరోవైపు మచిలీపట్నం మత్సకారుల గల్లంతుపై తక్షణం చర్యలు తీసుకోవాలని విపక్ష నేత చంద్రబాబు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. ఇందులో మత్సకారులు గల్లంతైనట్లు తెలిసినా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మచిలీపట్నానికి చెందిన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.. తమ వారు ఎలా ఉన్నారో అని వారి కుటుంబసభ్యులు రోధిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటకు చెందిన చిన మస్తాన్, నాంచార్లు, నరసింహారావు, వెంకటేశ్వరరావు సముద్రంలో ఎక్కడ ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలీక కుటుంబసభ్యులు కంటిమీద కునుకు లేకుండా వారి కోసం కన్నీరుమున్నీరవుతున్నారని సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు వివరించారు.
4 రోజులైనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి సరైన స్పందన లేదని చంద్రబాబు తెలిపారు. రెండు రోజుల క్రితం స్థానిక మత్స్యకారులు రెండు బోట్లు వేసుకుని సముద్రంలో గల్లంతయిన జాలర్ల కోసం గాలించినా ఉపయోగం లేకపోయిందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే జాలర్ల కుటుంబసభ్యులను మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నేతల బృందం పరామర్శించగా బాధితులు తమ బాధను తెలియజేశారన్నారు. జాలర్ల గల్లంతుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వారి ఆచూకీ కనిపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఈ లేఖ ద్వారా కోరుతున్నానన్నారు..