వైసీపీలోకి జనసేన మాజీ నేత - పవన్ వారిని నట్టేట ముంచారు : మనోహర్ సైతం అంతే..!!
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు గంగాధరం సీఎం జగన్ సమక్షం లో వైసీపీలో చేరారు. పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప, తనకు తానుగా ఏమి చేసుకోలేరని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేతగా పవన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని..ఇది నిజం కాదంటూ ఒక్క మాట చెబితే ప్రకటన ఇద్దామని తాను పలుమార్లు సూచించానని చెప్పారు. అయినా, కనీసం పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.


నమ్మిన వారిని నట్టేట ముంచారు
పవన్ ను నమ్ముకొని కొంతమంది ఉద్యోగాలను కూడా వదులుకుని బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. వారిని నట్టేట ముంచారంటూ ధ్వజమెత్తారు. నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌ను తప్పదోవ పట్టించేలా మాట్లాడుతూ బాస్‌కు జనం వస్తున్నారులే, గ్రామస్థాయిలో అవసరం లేదనే విధంగా చెప్పుకొచ్చేవారని మాదాసు వివరించారు. పార్టీని బలోపేతం చేద్దామని గతంలో పవన్‌కు సూచించినా కనీసం పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. తాను జనసేనకు దూరం అవ్వటం పైనా క్లారిటీ ఇచ్చారు.

తనకు అందుకే నచ్చలేదంటూ
కొంతమంది రాసిన వాటిని పట్టుకుని ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలు పవన్ చేయడం తనకు నచ్చలేదన్నారు. అందుకే కొద్దినెలలుగా జనసేనకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. బాలినేని, పెద్దిరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గతంలోనే తనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని మాదాసు తెలిపారు. ఇప్పటికే తన కుమారుడు మాదాసు పవన్ వైఎస్సార్సీపీలో ఉన్నారని చెప్పారు.

జగన్ సమక్షంలో వైసీపీలోకి
సీఎం జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా..ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాదాసు..గతంలో కాంగ్రెస్ లోనూ పని చేసారు. జనసేన తరపున పని చేస్తూ.. కొద్ది నెలల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసారు. ప్రస్తుతం చంద్రబాబు అధినేత పొత్తుల వ్యాఖ్యలు..టీడీపీ - జనసేన పొత్తు ఖాయం అంటూ ప్రచారం సాగుతున్న వేళ..జనసేన మాజీ నేత ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.