andhra pradesh guntur man hulchul knife problems solve police arrest ఆంధ్రప్రదేశ్ గుంటూరు యువకుడు హల్ చల్ కత్తి సమస్యలు పరిష్కారం పోలీసులు అరెస్ట్
నవ్యాంధ్ర రాజధానిలో నయా జనతా గ్యారేజ్: సమస్యలను పరిష్కరిస్తానంటూ కత్తితో యువకుడి హల్చల్
గుంటూరు:నవ్యాంధ్ర రాజధానికి నడిబొడ్డున ఉండే తాడేపల్లి ఉండవల్లి సెంటర్ క్రమంగా నేరస్తులకు అడ్డాగా మారుతోంది. తాజాగా పట్టపగలు విచ్చు కత్తితో వీరంగం వేసిన ఒక యువకుడి ఉదంతం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ నడించిన జనతా గ్యారేజ్ సినిమా స్టైల్లో ఒక యువకుడు తాను కూడా జనతా గ్యారేజ్ పెట్టానని, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే నా జనతా గ్యారేజ్ కి వచ్చి చెప్పండంటూ మెయిన్ రోడ్డుపై ఆ కత్తి పట్టుకొని అటూ ఇటూ పచార్లు చేస్తూ హల్ చల్ చేశాడు. కొంతసేపటికి స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో..."బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్..ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది..జనతా గ్యారేజ్"...అనే డైలాగ్ ఉంది. మరి ఆ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందాడో ఏమో కాని అదే తరహా ఒక యువకుడు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు.
అంతేకాదు...దానికి ట్యాగ్ లైన్ కూడా..."మీ వెనుక నేనున్నాను.. మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి"...అని పెట్టాడు. అంతటితో ఆగకుండా సోమవారం మధ్యాహ్నం సమయంలో తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ కి కత్తి పట్టుకొని కేకలు వేస్తూ నడిరోడ్డుపై హడావుడి చేశాడు. తనది జనతాగ్యారేజ్ అని...నాకు మీ సమస్యలు చెప్పుకోండంటూ మెయిన్ రోడ్డుపై ఆ కత్తితోనే అటూ ఇటూ పచార్లు చేయడం మొదలెట్టాడు.

విచ్చుకత్తితో యువకుడి వీరంగం చూసిన జనం భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఆ యువకుడు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడూతూ...'నా దగ్గరకి రా...క్షణాల్లో సమస్య పరిష్కరిస్తా' అంటూ కేకలు వేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యువకుడి హల్ చల్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి పేరు ప్రదీప్ గా గుర్తించారు.
జనతా గ్యారేజ్ గ్రూప్
అంతే కాదు ఆ యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. 'ఎవరికైనా ఏదైన సమస్యలు ఉంటే వెంటనే గ్రూప్లో పెట్టండి. జనతా గ్యారేజ్ మీకు న్యాయం చేస్తుంది. జయహో జనతా 'అంటూ మెస్సేజ్ చేశారు. సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయ్యడంటూ ఓ నెంబర్ను కూడా గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఆ యువకుడి పేరు ప్రదీప్ అని, గ్రూప్లో ఉన్న మిగతా వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.