• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్రానికి తలొగ్గి 'హోదా'ను తాకట్టు పెట్టిన జగన్-రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు-మావోయిస్టుల లేఖ

|

వైసీపీ రెండేళ్ల పాలనపై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ప్రజా వ్యతిరేక,నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. అవినీతి కేసులు ఉన్న జగన్ కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మావోయిస్టు పార్టీ విమర్శించింది. రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌ పేరిట గురువారం(జూన్ 17) ఓ లేఖ విడుదలైంది.

జగన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని...

జగన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని...

కేంద్రం అవలంభిస్తున్న ప్రజా,రైతు వ్యతిరేక విధానాలను,లౌకికవాదులు,ప్రగతిశీల శక్తులపై పెడుతున్న రాజద్రోహం కేసులు.. నిర్బంధాలకు జగన్ మద్దతు ప్రకటిస్తున్నారని మండిపడింది.

తనను విమర్శించే మీడియాపై సైతం కేసుల పెడుతూ పత్రికా స్వేచ్చను హరించేలా జగన్ వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ప్రజలను పక్కదోవ పట్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించింది. జగన్ నిరంకుశ,అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు అందరూ ముందుకురావాలని పిలుపునిచ్చింది.

మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా...

మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా...

కొంతకాలంగా మరుగునపడిపోయిన ఏపీ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెర పైకి వచ్చింది. మూడు రోజుల క్రితం అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం చేయాల్సినదంతా చేస్తున్నారని... కేంద్రమే ఈ విషయంలో వెనుకడుగు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. హోదాపై జగన్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రజలు ఆయన మాటను విశ్వసించి 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హోదా విషయంలో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది.

వైసీపీపై పెరుగుతున్న ఒత్తిడి...

వైసీపీపై పెరుగుతున్న ఒత్తిడి...

తాజాగా మావోయిస్టు పార్టీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం. హోదా విషయంలో ఇప్పటికే ప్రతిపక్షం నుంచి వైసీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కొన్నాళ్లుగా అంతగా చర్చల్లో లేకుండా పోయిన హోదా అంశం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారుతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం హోదా విషయంలో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందా.. లేక ఇప్పట్లో ఎన్నికలేమీ లేవు కాబట్టి లైట్ తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.

ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న గణేశ్..

ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న గణేశ్..

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తాజాగా లేఖ రాసిన మావోయిస్టు పార్టీ నేత గణేశ్ రెండు రోజుల క్రితం విశాఖ మన్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) కార్యదర్శిగా గాజర్ల రవి అలియాస్‌ గణేశ్ కొనసాగుతున్నారు. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా... తప్పించుకున్నవారి కోసం సుమారు 600 బలగాలతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విశాఖ మన్యంలో వరుస ఎన్‌కౌంటర్లు,లొంగుబాటులు మావోయిస్టుల ఉనికిని బలహీనపరుస్తున్నాయి. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి కూంబింగ్,ఎన్‌కౌంటర్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 22,2019న విశాఖ ఏజెన్సీలోని గుమ్మరేవుల వద్ద ఐదుగురు మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత మన్యంలో పెద్దగా అలజడి కనిపించలేదు.దాదాపు రెండేళ్ల తర్వాత తాజాగా మన్యం మళ్లీ దద్దరిల్లింది. గ్రేహాండ్స్ దళాలకు,మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులతో పాటు ఇద్దరు డివిజనల్‌ కమిటీ సభ్యులు ఉన్నారు.

English summary
The Maoist party has expressed outrage over the YSRCP's two-year rule. Maoist leader Jagan called for a united struggle against anti-people, authoritarian policies of CM YS Jagan. A letter to this effect was issued on Thursday (June 17) in the name of Ganesh, secretary of the Maoist party's Andhra-Odisha Border (AOB) Special Zonal Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X