నక్సల్స్ చేతికి అత్యాధునిక ఆయుధాలు:"వణుకు పుట్టించే ప్రణాళిక" సిద్ధం
అమరావతి: నక్సల్స్ మరోసారి విరుచుకు పడనున్నారా?...తమను ఏరిపారేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రతీకారంగా మెరుపుదాడులు చెయ్యాలని భావిస్తున్నారా?...అందుకోసం అత్యాధునిక ఆయుధాలు సైతం సమకూర్చుకున్నారా?...ఆ మేరకు ప్రణాళికలు కూడా సిద్దం చేసుకున్నారా?...అంటే అవుననే భద్రతా దళాలే అనుమానిస్తున్నాయి.
మావోయిస్ట్ ల చేతికి అత్యాధునికమైన ఆయుధాలు చిక్కాయన్న సమాచారం భద్రతా దళాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన స్నైపర్ రైఫిల్స్ తో సహా మరికొన్నివిధ్వంసకర ఆయుధాలు వారు సమకూర్చుకున్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. అంతేకాదు మావోయిస్ట్ లు వారి వద్ద నున్న అత్యాధునిక ఆయుధాలకు సొంత టెక్నాలజీని జోడించి వాటిని మరింత ప్రమాదకరంగా...స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకున్నారని తెలిసి భద్రతాదళాలు అప్రమప్తమయ్యాయి.

ఆపరేషన్ గ్రీన్ హంట్...మావోయిస్టులకు చావు దెబ్బ...
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్'ను అమలు చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతాదళాలు అనేకమంది కీలకమైన మావోయిస్టునేతలను మట్టుబెట్టడంతోపాటు నక్సల్స్ కు కంచుకోటల్లాంటి అబూజ్మడ్, లాల్‌గఢ్ వంటి ప్రాంతాల్లోకి సైతం చొచ్చుకు వెళ్లాయి. దీంతో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడటంతో పాటు...కొన్నేళ్ల పాటు అసలు ఉనికి చాటు కోవడం కూడా కష్టమైంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు సంబంధించి అందిన తాజా సమాచారం భద్రతా దళాలను కలవర పరుస్తోంది.

దాడులకు ప్రతీకారంగా...ప్రతిదాడులు...
భద్రతా దళాలు ఆపరేషన్ గ్రీన్ హంట్‌తో తమను చావుదెబ్బ తీయడంతో నక్సల్స్ మనుగడ కష్టతరమైపోవడంతో పాటు క్యాడర్ కూడా కనిష్ట సంఖ్యకు పడిపోయింది. దీంతో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు, క్యాడర్ ను కాపాడుకునేందుకు మెరుపుదాడులకు తెగబడుతున్నారు...ఈ క్రమంలో
మావోయిస్టులు గత ఏడాది దండకారణ్యంలోని బుర్కాపాల్‌లో సీఆర్పీఎఫ్ దళాలపై దాడిచేసి 28 మందిని హతమార్చారు. దీంతో కేంద్రం మరింత పట్టుదలతో 2022 నాటికి అసలు నక్సల్స్ అనే వారే ఉండకూడదన్నలక్ష్యంతో గత ఏడాది మే 17న ‘ఆపరేషన్ సమాధాన్'ను ప్రారంభించింది. నక్సల్స్ పై దాడులను మరింత తీవ్ర తరం చేసింది.

అయితే ఈసారి నక్సల్స్...మరింత వ్యూహాత్మకంగా...
దీంతో ఆపరేషన్ సమధాన్కు ధీటుగా బదులిచ్చేందుకు మావోయిస్టులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ చేపట్టారు...ఆ క్రమంలో మారిన కాలానుగుణంగా అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీని సమకూర్చుకోవాలని మావోయిస్టు పార్టీ గెరిల్లా దళాల బాధ్యతలు చూసే సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) నిర్ణయించింది...అయితే మావోయిస్టులు నిర్ణయించడమే కాదు...తామనుకున్న విధంగానే అలా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడంలో విజయవంతం అయ్యారని తెలియడమే ఇప్పుడు భద్రతా దళాల ఆందోళనకు కారణమైంది.

అత్యంత ఆధునికం...విధ్వంసకరం, ప్రమాదకరం కూడా...
అలా మావోయిస్ట్ లు చేజిక్కించుకున్నఆయుధాల్లో అత్యంత అధునాతమైనవి...విధ్యంసకరమైనవి ఉన్నాయట. వాటిలో అతి ముఖ్యమైనవి...2 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం గురిచూసి ఛేదించగల స్నైఫర్ రైఫిళ్లు...ఐఈడీ లు...ఇవి కూడా ఉన్నాయని తెలియడమే భద్రతాదళాల కలవరపాటుకు కారణం.
పైగా నక్సల్స్ వారి పోరాట పద్దతులకు అనువుగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వెదురు బాణాల చివర శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్)ను అమర్చి చిన్నతరహా రాకెట్ లాంఛర్ల లాగా మలిచారట. ఇకపై కూంబింగ్ కు వెళ్లే భద్రతా దళాలపై నక్సల్స్ ఈ స్నైపర్ రైఫిళ్లు, ఐఈడీ బాణాలతో దాడి చేస్తారని తెలిసి ఇప్పుడు భద్రతా దళాలు కొంత ఆత్మ రక్షణ ధోరణి అవలంభించాలని యోచిస్తున్నాయి. ఈ తాజా పరిమాణాలతో ఇకపై కూంబింగ్‌కు వెళ్లే భద్రతాదళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పదని పోలీసు ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు.

ఈ ఆయుధాలతో విధ్వంసం...తీరిది
ఇప్పటి వరకు మావోయిస్టులు తమను మట్టుబెట్టేందుకు వచ్చే భద్రతా దళాలను ఎదుర్కొనేందుకు ల్యాండ్ మైన్స్ పెట్టడం, ఆ తర్వాత మాటువేసి దాడులు చేయడం వంటి గెరిల్లా తరహా దాడులకే పరిమితమవుతూ వచ్చాయి. అయితే కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సమాధాన్ నేపథ్యంలో మావోయిస్టులు కూడా తమ పోరాట పంథాను సమూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీని స్థానిక పరిస్థితులతో మేళవించడంలో నక్సల్స్ చూపిస్తున్న నైపుణ్యం పోలీస్ అధికారులను ఆలోచనలో పడేస్తోంది. గిరిజనులు వాడే సంప్రదాయ ఆయుధాలకు అత్యాధునిక ఆయుధాలను జోడించి ఐఈడీ బాణాల వంటి భారీ విధ్వంసకర ఆయుధాలను నక్సల్స్ తయారు చెయ్యడం అధికారులను విస్మయపరిచింది.

ఐఈడీని...ఆల్రెడీ ఒకసారి వాడారా?...ఎక్కడంటే...
నక్సల్స్ ప్రయోగించే ఈ ఐఈడీ బాణాలు భూమిని లేదా వాహనాలను తాకిన వెంటనే భారీ విస్పోటనాన్ని కలిగించి పేలిపోయేలా మావోయిస్టులు డిజైన్ చేశారట, అంతేకాదు ఈ బాణాలకు వినియోగించే ఐఈడీ కూడా అత్యంత ప్రమాదకరమైన ఆరోతరం ఐఈడీ కావడం గమనార్హం...తక్కువ పరిమాణంతో ఎక్కువ విధ్వంసం ఆరోతరం ఐఈడీల ప్రత్యేకత. రెండు లేదా మూడు ఐఈడీ బాణాలను వదిలితే ఓ భారీ ల్యాండ్‌మైన్‌ను పేల్చినంత విధ్వంసం జరుగుతుంది. గత ఏడాది సుకుమా జిల్లాల్లో 25 మంది సీఆర్పీఎఫ్ కమెండోలను అంతమొందించిన ఘటనలో...బుర్కాపాల్ అంబుష్ లో మావోయిస్టులు ఈ ఐఈడీలనే ఉపయోగించినట్లు పోలీసులకు తెలిసింది. అంతేకాదు ఆ తరువాత ఈ బాణాలు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా అత్యాధునిక విల్లులను కూడా నక్సల్స్ రూపొందించినట్లు పోలీసులకు సమాచారం అందింది...వీటిని ఎక్కడికైనా సులువుగా తరలించే అవకాశం ఉండటంతో ముందు ముందు వీటితో పెను ముప్పు పొంచి ఉందని భద్రతాదళాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నక్సల్స్...వణుకు పుట్టించే ప్రణాళిక!
ఈ నేపథ్యంలో నక్సల్స్ వణుకు పుట్టించే ప్రణాళికను ఒక దానిని సిద్దం చేశారని మావోయిస్టు పార్టీ గెరిల్లా దళాల బాధ్యతలు చూసే సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) తన సర్క్యులర్‌లో పేర్కొనడం...ఆ విషయం భద్రతా దళాలకు తెలియడంతో ఈ మొత్తం సమాచారం బైటకు తెలిసింది. అయితే ఇప్పుడు భద్రతా దళాలను కలవర పరుస్తున్న అంశమేమిటంటే...నక్సల్స్ సిద్దం చేసిన ‘వణుకు పుట్టించే ప్రణాళిక' ఏమిటనేదే...అంతేకాదు...కూంబింగ్ కోసం అడవులకు వచ్చే భద్రతాదళాలను నిలువరించేందుకు గెరిల్లా యుద్ధ వ్యూహాలు, ఎత్తుగడలను సిద్ధం చేసినట్లు కూడా సీఎంసీ తన సర్క్యులర్‌లో వివరించిందట. అందులో భాగంగానే ఈ స్నైపర్ రైఫిల్స్...రెండోది ‘ఆరోతరం ఐఈడీ'ల దాడుల గురించి సిఎంసి పేర్కొన్నట్లు తెలిసింది.

ముప్పు...భద్రతా దళాలకేనా...
సీఎంసీ వ్యూహాత్మకంగా ఈ రెండు ఆయుధాల గురించే ఉద్దేశ్యపూర్వకంగానే బైటపెట్టిందని, అయితే ఇంకా నక్సల్స్ వద్ద రహస్య అస్త్రాలు చాలానే ఉండి ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టులు ప్రస్తుతం పీఎల్జీఏల్లో చురుగ్గా ఉండే కమెండోలకు స్నైపర్ రైఫిళ్ల వినియోగంపై విస్తృతంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. అయితే నక్సల్స్ సమకూర్చుకున్నవివిధ రకాల అత్యాధునిక ఆయుధాలతో ముప్పు కేవలం భద్రతా దళాలకు మాత్రమే కాదని ప్రజాప్రతినిధులకు కూడా అని పోలీస్ ఉన్నతాధికారులు వారు అభిప్రాయపడుతున్నారు.