
ఆత్మకూరు బరిలో విక్రమ్ రెడ్డి- పోటీగా బరిలో నిలచేదెవరు : తెర వెనుక..!!
ఏపీలో మరో ఎన్నికల సమరం మొదలైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్ షెడ్యూల్ విడుదల అయింది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి మేకపాటి కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని సీఎం జగన్ గతంలోనే నిర్ణయించారు. ఎవరు పోటీలో ఉంటారనే నిర్ణయం మేకపాటి కుటుంబానికే వదిలేసారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో చర్చల తరువాత గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ నుంచి విక్రమ్ రెడ్డి
ఇదే విషయాన్ని సీఎం జగన్ కు చెప్పగా..ఆయన ఆమోద ముద్ర వేసారు. ఇప్పటికే విక్రమ్ రెడ్డి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయనే ఇప్పుడు వైసీపీ నుంచి అభ్యర్దిగా అధికారికంగా పోటీలో నిలవనున్నారు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులే పోటీలో ఉంటే వారికే ఏకగ్రీవానికి సహకరించటం ఆనవాయితీగా వస్తోంది. కానీ, రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో అనేక కారణాలతో ఎన్నికలు జరిగాయి. ఇక, ఇప్పుడు ఆత్మకూరులోనూ పోటీ తప్పేలా లేదు. గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన సోదరుడే పోటీలో ఉంటుండటంతో టీడీపీ - జనసేన పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ తమది జాతీయ పార్టీ కావటంతో..తమ విధానం వేరని చెబుతోంది.

బీజేపీ అభ్యర్దిగా మేకపాటి బంధువు
ఫలితంగా మేకపాటి సమీప బంధువు ఒకరిని బరిలోకి దింపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రోజున నెల్లూరు లో బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తమ అభ్యర్ధిని బరిలో నిలిపే అంశం పైన పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే, బద్వేలు ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్ధి అధికారికంగా పోటీలో నిలిచినా,...ఇతర పార్టీలు లోపాయి కారీగా వైసీపీ అభ్యర్దికి వ్యతిరేకంగా సహకరించాయంటూ వైసీపీ ఆరోపించింది. ఇక, ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ పరిస్థితుల్లో తమ మెజార్టీ నిరూపించుకొనేందుకు వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.

పరోక్ష సహకరాలు- మెజార్టీయే కీలకం
గతంలో బద్వేలు ఎన్నిక తరహాలోనే సీనియర్లకు సీఎం జగన్ ఈ ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించనున్నారు. అదే సమయంలో... వైసీపీ బలం తగ్గిందని చెప్పేందుకు వీలుగా.. పోటీలో ఉన్న వారికి మద్దతుగా ప్రధాన పార్టీలు పరోక్షంగా సహకరించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, వైసీపీ మాత్రం తమకు గెలుపు కంటే మెజార్టీ కీలకమని చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన.. మంత్రులు నేటి నుంచి బస్సు యాత్ర ఉండటంతో.. సీఎం తిరిగి వచ్చిన తరువాత ఆత్మకూరు బై పోల్ పైన కార్యాచరణ డిసైడ్ కానుంది. జూన్ 23న పోలింగ్, జూన్ 26న లెక్కింపు జరగనుంది.