మండలిలో నేను తప్పు చేస్తే రాజీనామా చేస్తా .. మీరు చేస్తారా : టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి అనీల్ సవాల్
ఏపీ శాసన మండలి నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక నిన్న శాసనమండలిలో జరిగిన ఘటనపై అటు టిడిపి, ఇటు వైసిపి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇక తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శాసనమండలిలో టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ తాను తప్పు చేసినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే టిడిపి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు.
లోకేష్ ను కొట్టాలనే వైసీపీ మంత్రుల ప్రయత్నం... అడ్డుకోకుండా ఎలా ఉంటాం : యనమల షాకింగ్ కామెంట్స్

బిల్లులను అడ్డుకునే కుట్ర చేసిన టీడీపీ .. అనీల్ ఫైర్
శాసనమండలిలో టిడిపి చౌకబారు రాజకీయాలు చేసిందని, మండలిలో నిన్న జరిగిన ఘటనలు దారుణమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మండలిలో మాకు బలం ఉంది కాబట్టి ఏమైనా చేస్తాం అన్నట్లుగా టిడిపి నేత యనమల రామకృష్ణుడు మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇక రూల్ 90 కింద నోటీసు ఇవ్వాలంటే ఒకరోజు ముందే ఇవ్వాలని చెప్పినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీలు వినలేదని, సంఖ్యా బలం చూసుకొని టిడిపి నేతలు ప్రభుత్వ బిల్లులను అడ్డుకునే కుట్ర చేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

వీడియోలు తియ్యొద్దు అంటే మంత్రి వెల్లంపల్లిపై దాడి
ఇక టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో పిల్ల చేష్టలు చేశారని, వీడియోలు తీయడం చెయ్యొద్దు అని చెప్తే మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని ఆరోపణలు గుప్పించారు అనిల్ కుమార్ యాదవ్. కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న దురుద్దేశంతో టిడిపి మండలిని నిరవధిక వాయిదా వేయించి వెళ్లిపోయారని మంత్రి అనిల్ విమర్శించారు.
ఇక అంతేకాదు బిల్లుల ఆమోదం విషయంలో కూడా టిడిపి కుట్రపూరితంగా వ్యవహరించి ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదించకుండా వెళ్ళిపోయింది అంటూ నిప్పులు చెరిగారు. మండలిలో మేము టిడిపి ఎమ్మెల్సీలను కొట్టామని, బూతులు తిట్టామని టిడిపి నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అసభ్యంగా ప్రవర్తిస్తే నిరూపించండి
ఇక తాను సభలో జిప్ తీసి అసభ్యంగా ప్రవర్తించారని లోకేష్, అశోక్ బాబు, బాబు రాజేంద్ర ప్రసాద్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మహిళా ఎమ్మెల్సీల ముందు అసభ్యంగా ప్రవర్తించానని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఇక చైర్మన్ దగ్గరకు వెళ్లి వీడియోలు చూపించాల్సిందిగా అడుగుదామని ఆయన పేర్కొన్నారు. ఇక వాటిని నిరూపించాలని మంత్రి అనిల్ డిమాండ్ చేశారు. నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, నిరూపించ లేకుంటే టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా అంటూ చాలెంజ్ చేశారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది, చాలా చిరాకుగా ప్రవర్తించింది టిడిపి సభ్యులేనని ఆయన అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకుని టీడీపీ చరిత్రలో నిలిచి పోయిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.