సీబీఐ కోర్టుకు మంత్రి బొత్సా: ఆ కేసులో సాక్షిగా: రూ.5 కోట్ల రికవరీ కోసం..!
ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. గతంలోనో కోర్టుకు హాజరవ్వాలంటూ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే..ఈ నెల 12న హాజరు కావాల్సి ఉన్నా..మంత్రి బొత్సా అనుమతితో గైర్హాజరయ్యారు. దీంతో..కోర్టు మరోసారి సూచన చేయటంతో ఈ రోజు బొత్సా హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణంలో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. గతంలోనే ఇదే వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న బొత్సాకు అప్పట్లోనే క్లీన్ చిట్ లభించింది. అయితే.. సీబీఐ కోర్టులో మాత్రం కేసు కొనసాగుతోంది. పరిశ్రమల శాఖా మంత్రిగా బొత్సా ఉన్న సమయంలో చోటు చేసుకున్న వ్యవహారం కావటంతో సాక్షిగా బొత్సా కోర్టుకు హాజరయ్యారు.
వోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్సా..
వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ కోర్టు ముందుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణంలో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూష్టర్లపై కేసులు నమోదు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో కార్ల ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్ వ్యాగన్కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్కు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించింది.

అయితే వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2005లో వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. 3 వేల పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 59 మంది సాక్షులను విచారించింది. మొత్తం 12 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తన నివేదికలో పేర్కొంది.
బొత్సాకు క్లీన్ చిట్..సాక్షిగా హాజరు
నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించటంతో విచారణ తరువాత సీబీఐ అప్పటి పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్సాకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు రూ. 7 కోట్లు రికవరీ చేశారు. మిగిలిన రూ. 5 కోట్లు రికవరీ కోసం విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో భాగంగా అప్పటి వ్యవహారాలు పర్యవేక్షించిన మంత్రి బొత్సాను సాక్షిగా హాజరవ్వాలని సీబీఐ కోర్టు ఆగస్టులో నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 12నే ఆయన హాజరవ్వాల్సి ఉన్నా..గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. సాక్షిగా బొత్సా హాజరయ్యారు. దీని పైన బొత్సా గతంలోనే స్పందించారు. తనకు ఆ కేసులో ఎటువంటి ప్రమేయం లేదని సీబీఐ తేల్చిందని..అయితే కోర్టు నుండి నోటీసులు రావటంతో జరిగిన విషయాన్ని వివరించేందుకు కోర్టుకు హాజరువుతానని మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని బొత్సా స్పష్టం చేసారు.