ఇంకా చల్లారని ఎస్ఈసి రగడ ..నిమ్మగడ్డ రమేశ్ పై నిప్పులు చెరిగిన మంత్రి బుగ్గన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుండి చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇక తాజాగా ఎన్నికల కమీషనర్ తనకు రక్షణ లేదని కేంద్రానికి లేఖ రాయటం ఆ తర్వాత పరిణామాలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉంటూ తప్పుడు ప్రచారం చేస్తారా అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీశారు.

ఎన్నికల కమీషనర్ చేసింది అప్రజాస్వామికం
అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ వంద శాతం సీట్లు గెలిచిందని చెప్పిన ఆయన ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కావడంలో తప్పేముందన్నారు బుగ్గన. సీఎంను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు మంత్రి బుగ్గన. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దురుద్దేశ పూర్వకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని, అది అప్రజాస్వామికమని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా విషయంలో ఎన్నికల కమీషనర్ కు ప్రశ్నల వర్షం
రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా అని ప్రశ్నించారు బుగ్గన.అసలు కరోనా ప్రభావంపై ప్రభుత్వాన్ని అడగకుండానే నిర్ణయం తీసుకోవటం దారుణం అన్నారు. సమీక్షలు చేయకుండా సంబంధిత అధికార వర్గాలలో సంప్రదించకుండా వాయిదా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నల వర్షం కురిపించారు.కరోనాపై ముఖ్యమంత్రి జగన్ ముందస్తు చర్యలకు ఆదేశించారనికరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు.

ఎన్నికలు వాయిదా వేస్తే కోడ్ ఎందుకు కొనసాగించారని ఆగ్రహం
స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు అటు ప్రభుత్వాన్ని గానీ, వైద్యాధికారులను గానీ సంప్రదించారా? అని ప్రశ్నించిన బుగ్గన ఈసీకి సీఎస్ లేఖ రాసిన తర్వాత కూడా సీఎస్‌తో ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు . కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే కోడ్ ఎందుకు కొనసాగించారని ఈసీపై నిప్పులు చెరిగారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
ఇక కేవియేట్ పిటిషన్ దాఖలు చేయడంతోనే రమేశ్‌కుమార్ దురుద్దేశం అర్థమవుతుందని అన్నారు బుగ్గన .

తెలుగుదేశంపార్టీ నామినేషన్లు వేయకుంటే మాదా బాధ్యత
ఇక అధికార పార్టీ ఒత్తిడి ఉందని వచ్చిన ఆరోపణలపై స్పందించిన బుగ్గన ఒకవేళ అలా ఉంటే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నామినేషన్లు ఎలా వేస్తాయని రమేశ్‌ను ప్రశ్నించారు బుగ్గన. తెలుగుదేశంపార్టీ వాళ్లు నామినేషన్లు వేయకుంటే దానికి అధికారపార్టీ ఎలా బాధ్యత వహిస్తుందని అడిగారు. ఇప్పటికే టీడీపీ మరియు ఇతర పార్టీల నాయకులు, వైసీపీ నేతలు ఎలక్షన్ కమీషన్ ను తప్పు పట్టటాన్ని, అలాగే ఎన్నికల కమీషనర్ ను ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు . అయినా ఇంకా రమేష్ కుమార్ టార్గెట్ గా వైసీపీ మంత్రులు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు.