గుడివాడలో పేకాటపై ఎస్ఈబీ పంజా- పవన్ ఆరోపణలే నిజం- స్పందించని కొడాలి నాని
కృష్ణాజిల్లాలో తాజాగా పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ వెళ్లి స్ధానిక మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలకు దిగారు. మిగతా విమర్శల సంగతి ఎలా ఉన్నా గుడివాడలో పేకాట క్లబ్బ్లలు నిర్వహిస్తున్నారని, వీటికి మంత్రి అండ ఉందంటూ పవన్ ఆరోపించారు. దీనిపై ఆ తర్వాత పలుమార్లు కొడాలి నాని కౌంటర్లు ఇచ్చారు. అయితే తాజాగా ఏపీ సర్కార్ అక్రమాల నియంత్రణకు నియమించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడుల్లో పేకాట రాయుళ్ల నుంచి భారీగా నగదు, కార్లు, ఫోన్లు స్వాధీనం చేసుకోవడం పవన్ కళ్యాణ్ ఆరోపణలు నిజమని నిరూపించిందా అన్న చర్చ జరుగుతోంది.

గుడివాడలో పేకాటపై ఎస్ఈబీ దాడులు..
గుడివాడ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నా తాజాగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులతో ఇది మరోసారి బట్టబయలైంది. నియోజకవర్గంలోని నందివాడ మండలం తమిరశ గ్రామంలో ఆదివారం ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో భారీగా నగదు, కార్లు, ఫోన్లు, ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైకి 42 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నా కోట్ల రూపాయలు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ ఎత్తున కార్లు కూడా పట్టుబడటంతో వాటి ఓనర్లను వదిలిపెట్టి డ్రైవర్లను బుక్ చేసే పనిలో అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఘటనపై స్పందించని కొడాలి నాని
గుడివాడలో భారీ పేకాట డెన్‌పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు నిర్వహించి భారీ ఎత్తున నగదు, కార్లు, వైసీపీ నేతలను కూడా పట్టుకున్నా స్ధానిక ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మాత్రం దీనిపై నోరు మెదపలేదు. ఎస్ఈబీ దాడుల సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన మీడియాను సైతం మంత్రి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఊహించిన దాని కంటే భారీగానే ఎస్ఈబీ కనుగొందనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ ఘటనపై మంత్రి కొడాలి నాని స్పందించకపోవడంతో ఆరోపణలు నిజమనే ప్రచారం జరుగుతోంది. ఎస్ఈబీ అధికారులు మాత్రం నామమాత్రపు లెక్కలతో కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పవన్ ఆరోపణలే నిజమా ?
గుడివాడ నియోజకవర్గంలో భారీ ఎత్తున పేకాట ఆడిస్తున్నారని, ఇందులో మంత్రి కొడాలి నాని ప్రమేయముందని తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గుడివాడ వెళ్లి మరీ ఈ ఆరోపణలు చేసిన పవన్‌కు కొడాలి నాని సహా పలువురు రాష్ట్రమంత్రులు తీవ్ర విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు మూయిస్తుందే తామంటూ పవన్‌కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఎస్ఈబీ దాడులతో గుడివాడలో భారీ ఎత్తున పేకాట జరుగుతోందని తేలిపోయింది. ఎస్ఈబీ దాడుల నేపథ్యంలో విపక్ష టీడీపీ కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతోంది.

కొడాలిని టార్గెట్ చేసిన టీడీపీ
గుడివాడలో కోట్ల రూపాయలతో పేకాట ఆడిస్తున్న మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. నిజాయితీ గల ఒక పోలీసు అధికారి 40 మంది పోలీసు అధికారులతో దాడి జరిపారు. రూ.10 కోట్ల నగదు, 30 కార్లు సీజ్ చేశారు. పేకాట ఆడుతున్న 60 మందిని అరెస్టు చేసేందుకు వెళ్లిన అధికారులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. డబ్బు వదిలేసి వెళ్లాలని.. లేదంటే బదిలీ చేయిస్తామని.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. సీఎంకు దమ్ము, ధైర్యం ఉంటే దీనిపై సీబీసీఐడీతో గానీ, సీబీఐతో గానీ విచారణ జరిపించాలన్నారు.