అధికారులకు నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ , చంద్రబాబుకు ఎస్ఈసి బంట్రోతు : మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొదలైన రగడ నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు అధికారపార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు .
ఏకగ్రీవాల చుట్టూ తిరుగుతున్న పంచాయతీ పోరు .. వైసీపీ,టీడీపీతో పాటు అన్ని పార్టీల ఫోకస్, రీజన్ ఇదే

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
ఈరోజు తిరుపతిలో వైసిపి ఎమ్మెల్యేలతో పంచాయతీ ఎన్నికల పై సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బంట్రోతులా పని చేస్తున్నారంటూ ఆరోపించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

అధికారులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం
అధికారులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు రాగానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరోనా ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను గౌరవించామని తెలిపిన మంత్రి ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయితీ ఎప్పటినుంచో వస్తోందని, 2002 నుంచి ఉందని, ఇప్పుడు ప్రతిపక్షాలు కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా 19 ఏ చట్టం తీసుకు వచ్చామని తెలిపారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు అనుచరుడు.. అందుకే ద్వివేదిపై
వైసిపి గెలుస్తుందన్న భయంతో చంద్రబాబు నిమ్మగడ్డను అడ్డు పెట్టుకున్నారని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు అనుచరుడుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. గోపాలకృష్ణ ద్వివేది పైన చంద్రబాబుకు కోపం ఉందని పేర్కొన్న మంత్రి, అందుకే చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ద్వివేది పై చర్యలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండటం దురదృష్టకరమన్నారు .

పంచాయతీ ఏకాగ్రీవాలే లక్ష్యం .. వైసీపీ నేతలకు దిశా నిర్దేశం
పంచాయతీలను ఏకగ్రీవం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలో ప్రలోభాలకు పాల్పడి గెలిచిన వారికి 10 వేల జరిమానా తో పాటుగా మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా తీసుకువచ్చామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని పంచాయితీలను ఏకగ్రీవం చెయ్యాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు .