ఇడుపులపాయలో మంత్రి రోజా - ఐరెన్ లెగ్ అంటూ అప్పుడే అవహేళన : ఇక వార్ ఒన్ సైడే..!!
అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో ఫైర్ బ్రాండ్ రోజా మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో..ఈ రోజున ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ లో నివాళి అర్పించారు. మహానేతతో కలిసి పని చేసే అదృష్టం దక్కకపోయినా.. వైఎస్ జగన్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. కడప..తాను పుట్టిన గడ్డని చెప్పారు. తాను టీడీపీలో ఉన్న సమయంలోనే వైఎస్సార్ తనను తన పార్టీ లోకి రమ్మని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి పని చేయాలని కలలు గన్నా..ఆయన అకాల మరణంతో ఆ అవకాశం దక్కలేదన్నారు. దీంతో..తాను చాలా బాధ పడ్డానని చెప్పారు.

అప్పుడే టీడీపీ నేతలు అవహేళన చేసారు
ఆ సమయం లోనే టీడీపీ నేతలు తనను ఐరెన్ లెగ్ అంటూ అవహేళన చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. వైఎస్సార్ తనకు దేవుడని రోజా చెప్పుకొచ్చారు. ఆయన ఆశయాల సాధన కోసం ఏర్పటు అయినదే వైస్సార్సీపి అని చెప్పారు. వైఎస్సార్ ఆశీస్సుల కోసమే ఇడుపుల పాయకు వచ్చానన్నారు. ఎమ్మెల్యే కావాలనేది తన కలగా పేర్కొన్నారు. ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఇప్పుడు సీఎం జగన్ ఆశీర్వాదరంతో మంత్రిని కూడా అయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు.

జగన్- పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తా
జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న మంత్రి ఆర్కే రోజా.. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తానని స్పష్టం చేసారు. తాను గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినప్పుడు.. వైఎస్ జగన్ను సీఎం చేయాలని భగవంతుడ్ని వేడుకున్నానని, ఆ కోరిక నెరవేర్చినందుకు కళ్యాణోత్సవానికి హజరయ్యానని రోజా వివరించారు. ఇకపై జబర్దస్త్ చేయరా అని చాలా మంది అడుతున్నారని, కానీ.. పది మందికి ఉపయోగ పడటం కోసం ఒకటి వదులుకోక తప్పదని ఆమె చెప్పారు. ఆర్థిక పురోగతి సాధించే విధంగా ఏపీలో పథకాలు అమలు అవుతున్నాయని విశ్లేషించారు.

ఏ ఎన్నిక అయినా వార్ ఒన్ సైడే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో నే కాదని..ఇక ప్రతీ ఎన్నికలోనూ వార్ ఒన్ సైడ్ అవుతుందని రోజా ధీమా వ్యక్తం చేసారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని వివరించారు. ఒంటిమిట్టలో జరుగుతున్న కళ్యాణోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందించనున్నారు. మంత్రిగా ఖరారైన వెంటనే రోజా జబర్ధస్త్ కు బైబై చెప్పారు. రోజా ఆ షోకు సంబంధించిన వీడ్కోలు కార్యక్రమంలో కంట తడి పెట్టారు. ఆ షో తో తనకు ఉన్న అనుబంధం వివరించారు. ఇప్పటికే టూరిజం శాఖా మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించి..ఈ రోజు ఒంటిమిట్టలో కార్యక్రమానికి హాజరయ్యారు.