
చంద్రబాబుపై మంత్రి విడదలరజిని హాట్ కామెంట్స్.. ఆ వీడియోలతో టీడీపీ మహిళానేతలు రివర్స్ ఎటాక్!!
చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసిపి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి విడదల రజని టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ 25వ తేదీన మంత్రి విడదల రజిని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన తర్వాత విడదల రజిని చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధ విడదల రజినిని టార్గెట్ చేశారు.

మినీ మహానాడులకు జనాలు రాలేదని .. చంద్రబాబుపై మంత్రి విడదల రజిని వ్యాఖ్యలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తమను బాగా ఆదరిస్తున్నారని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు మినీ మహానాడులకు ప్రజలు రాకపోవడంతో మతిభ్రమించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటూ మంత్రి విడదల రజిని చంద్రబాబును టార్గెట్ చేశారు.
జనం రానిది ఎవరికో తెలుస్తుందా? వీడియో పోస్ట్ చేసి టార్గెట్ చేసిన అనిత
ఇక విడదల రజిని చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విడదల రజని గారూ! జనం రానిది ఎవరికో తెలుస్తుందా? ఇది మీ నాయకుడికి కూడా పంపించండి. ఆ విధంగా అయినా తిక్క కుదుర్తుందేమో? అంటూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసి అటు మంగళగిరిలోనూ, ఇటు చింతలపూడి లోనూ వైసిపి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనం రావడం లేదని, కనీసం పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని విడదల రజిని తెలుసుకోవాలంటూ సెటైర్లు వేశారు.

నేటి నుండి నా అగ్రెసివ్నెస్ 2.0 చూస్తావు: జగన్ రెడ్డిని టార్గెట్ చేసిన వంగలపూడి అనిత
అంతేకాదు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అంటూ విరుచుకు పడిన వంగలపూడి అనిత మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నేను బంతి లాంటి దాన్ని. నువ్వు ఎంత గట్టిగా నేలకు కొడదాం అని చూస్తే అంతే వేగంగా పైకి లేస్తాను అని వంగలపూడి అనిత పేర్కొన్నారు. నేటి నుండి నా అగ్రెసివ్నెస్ 2.0 చూస్తావు. నువ్వు ఎన్ని గజ్జి కుక్కల్ని నా మీదకు వదులుతావో వదులుకో జగన్ రెడ్డీ అంటూ సవాల్ విసిరారు. తగ్గేదీ లేదు, నీ అక్రమాలు, అన్యాయాలపై యుద్ధం ఆపేదీ లేదు అంటూ వంగలపూడి అనిత తేల్చిచెప్పారు.
మీ మొఖాలకి సొంత పార్టీ వాళ్ళే రావట్లేదు: మండిపడిన పంచుమర్తి అనురాధ
ఇక మరోపక్క పంచుమర్తి అనురాధ కూడా విడదల రజిని ని టార్గెట్ చేశారు. విడదల రజని గారు.. నిన్ననే అంటున్నట్లు ఉన్నారు.. జనం రావట్లేదు అని? మీ మొఖాలకి సొంత పార్టీ వాళ్ళే రావట్లేదు.. తెలుస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఫెయిల్ అయిందని, ప్రజలెవరూ వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆదరించటం లేదని, ఆదరణ లేనిది జగన్ రెడ్డికి అని రివర్స్ ఎటాక్ చేశారు.