ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం .. స్పందించిన మంత్రులు నారాయణ స్వామి,ధర్మాన.. ఏమన్నారంటే
నగరి ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు వైసీపీ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా తననెవరూ పట్టించుకోవటం లేదంటూ, ప్రోటోకాల్ పాటించటం లేదంటూ కన్నీటిపర్యంతమైన ఘటన ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రోజా ను కావాలని అధికార పార్టీ నేతలు తొక్కేస్తున్నారు అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
బోరున ఏడ్చిన ఎమ్మెల్యే రోజా .. తననెవరూ పట్టించుకోవటం లేదని ప్రివిలేజ్ కమిటీ ముందు కన్నీటి పర్యంతం

గ్రూప్ రాజకీయాలు తనకు చేతకావన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
ఇక ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం పై, రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు చేసిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. తాను అందరినీ కలుపుకొని వెళ్తానని, గ్రూపు రాజకీయాలు చేయడం తనకు చేతకాదని సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. తమ పార్టీలో ఎవరితోనూ తనకు విభేదాలు లేవని పేర్కొన్న ఆయన, రోజా ఎందుకు అలా మాట్లాడారో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రోజా ప్రోటోకాల్ వివాదంపై స్పందించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
తాను ప్రతి ఒక్కరితోనూ సయోధ్య తో మెలిగే వ్యక్తిని అని పేర్కొన్న నారాయణస్వామి, ప్రతి ఒక్కరికి దండం పెట్టి వెళ్ళేవాడినని తనకు గ్రూపు పాలిటిక్స్ చేయడం చేత కాదని చెప్పారు. ఇంతకు ముందు అనేకమార్లు రోజాకు , నారాయణ స్వామికి మధ్య ఉన్న విబేధాలపై చర్చ జరిగిన విషయం తెలిసిందే .ఇక రోజా ప్రోటోకాల్ వివాదం పై మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని, అయినంత మాత్రాన అవి నాయకుల మధ్య విభేదాలుగా మాట్లాడుకోవద్దని ఆయన పేర్కొన్నారు.

చిన్న చిన్న వివాదాలు అవే సమసిపోతాయన్న మంత్రి
అధికారులకు మాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్న ధర్మాన కృష్ణదాస్, చిన్న చిన్న వివాదాలున్నా వాటంతటవే సర్దుబాటు అవుతాయని, సమసిపోతాయని పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రోజా మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఏ విషయంలో అయినా ప్రతిపక్ష పార్టీపై ఫైర్ బ్రాండ్ గా విరుచుకు పడే రోజాకు పార్టీ అధిష్టానం తగిన గౌరవం ఇవ్వలేదని ఒకింత అసహనంతో ఉన్నారు.

ప్రివిలేజ్ కమిటీ ముందు విలపించిన రోజా ... అధికార వైసీపీ లో చర్చనీయాంశం
ఏపీఐఐసీ చైర్మన్ గా అయినా రోజాకు గుర్తింపు వస్తుందనుకుంటే, కనీసం ఎమ్మెల్యేగా కూడా ఆమెను గుర్తించడం లేదని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా లబోదిబోమన్నారు. కన్నీరు పెట్టుకున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా తన అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజా కన్నీటి వెనుక అధికార పార్టీ నేతలు, చిత్తూరు జిల్లా మంత్రులు ఉన్నారని చర్చ జరుగుతోంది.
ఇక ఇది స్థానిక మంత్రులకు చిరాకు తెప్పిస్తుంది. అధికార పార్టీలోనే చర్చకు కారణంగా మారింది.