ఎట్టకేలకు పీఏను మార్చిన బాలయ్య.. కొత్త పీఏ ఎవరంటే!
అనంతపురం: హిందూపురం పాలిటిక్స్ లో ఎమ్మెల్యే బాలయ్య పీఏ జోక్యం పెరిగిపోతోందంటూ అక్కడి స్థానిక నేతల్లో అసమ్మతి సెగ రగిలిన సంగతి తెలిసిందే. రహస్య భేటీలతో అటు టీడీపీ అధిష్టానంలోను కలవరం మొదలైంది.
'నాకు తెలియకుండా ఏది జరగవద్దు': రహస్య భేటీలపై బాలయ్య వార్నింగ్
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా తన పీఏను మార్పు చేయడం గమనార్హం. ఇన్నాళ్లు తనవద్ద పీఏగా పనిచేసిన చంద్రశేఖర్ స్థానంలో ఎన్టీఆర్ భవన్(హైదరాబాద్) లో పనిచేసే కృష్ణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది.

కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగాను, కార్యాలయ కార్యదర్శిగాను చాలాకాలం పాటు పనిచేశారు. మాజీ మంత్రి రామచంద్రయ్య టీడీపీ గూటిలో ఉన్నప్పుడు జిల్లా పాలిటిక్స్ లో ఆయన కీలకంగా వ్యవహరించారు.
కృష్ణమూర్తి పనితీరు మెచ్చిన టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ కు పిలిపించుకుంది. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్లోనే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యవేక్షకుడిగా, కార్యక్రమాల కమిటీ ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్యే బాలయ్యతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏరి కోరి కృష్ణమూర్తిని బాలయ్య తన పీఏగా నియమించుకున్నారని సమాచారం. బుధవారం నాడు కృష్ణమూర్తి హిందూపురం వెళ్లి అక్కడే బాధ్యతలు స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తన పీఏను మార్చేయడం ద్వారా అక్కడి నేతల్లో ఉన్న అసంతృప్తికి బాలయ్య చెక్ పెట్టినట్టయింది.