
ఎమ్మెల్సీ అనంతబాబును వెంటాడుతున్న 'హైకోర్టు'?
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రీ రిజిస్టర్ ఎలా చేస్తారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సెక్షన్ 174 కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఆల్టర్ చేయకుండా ఐపీసీ సెక్షన్లతో రీ రిజిస్టర్ చేశారు. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. డిసెంబరు 12వ తేదీకి కేసు వాయిదా పడింది.

సీబీఐకి కేసు అప్పగించాలి
అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించాలని సుబ్రమణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతబాబు భార్య, మరికొందరి సమక్షంలో ఈ హత్య జరిగిందని పిటిషనర్ల తరఫున జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సీసీటీవీ ఫుటేజ్ లో వారంతా కనిపిస్తున్నారని, అయితే వారిపై కేసు నమోదు చేయకుండా ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక కోసం చూస్తున్నామంటూ పోలీసులు కాలక్షేపం చేస్తున్నరాని చెప్పారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో దర్యాప్తు సజావుగా సాగడంలేదని, మృతుడి శరీరంపై 32 తీవ్ర గాయాలున్నాయని, దీన్నిబట్టి ఘటనలో అనంతబాబుతోపాటు మరికొందరు పాల్గొన్నట్లు స్పష్టమవుతోందన్నారు.

మొదట అనుమానాస్పద మృతిగా నమోదు
ఈ కేసును మొదటి అనుమానాస్పద మృతి కింద నమోదు చేశారు. బాధితుడి బంధువులు నిరసన చేయడంతో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారు. రిమాండ్ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేయలేదు. గడువు దాటిన తర్వాత దాఖలు చేశారు. దీంతో మెజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ఎమ్మెల్సీపై రౌడీషీట్ ఉన్నప్పటికీ ఎలాంటి నేర చరిత్ర లేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జడ కోరారు.

ల్యాబ్ నుంచి నివేదిక రావాలి
పోస్టుమార్టం ఆధారంగా ఎఫ్ఐఆర్ రీ రిజిస్టర్ చేశారని, దర్యాప్తు నిస్పాక్షికంగా చేస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ను ల్యాబ్ కు పంపించామని, నివేదిక రావాల్సి ఉందని, ఇది సీబీఐకి బదిలీ చేసే కేసు కాదని హోం శాఖ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. ప్రతివాదిగా చేరేందుకు అనంతబాబు భార్య అనంత లక్మీదుర్గకు అవకాశం ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.