ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్ల నిషేధం- స్పీకర్ తమ్మినేని నిర్ణయం-చంద్రబాబు ఎపిసోడ్ తో
ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సభలోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ సభలో ఓ ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా నిర్ణయం ప్రకారం ఇకపై సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ప్రకటించారు. తాజాగా చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైంది. చంద్రబాబుకు స్పీకర్ మైక్ కట్ చేసినా చంద్రబాబు వీడియోను టీడీపీ సభ్యులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో సర్క్కులేట్ చేసేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ నిర్ణయంతో ప్రస్తుతం అసెంబ్లీకి హాజరవుతున్న వైసీపీ సభ్యులు, సీఎం కూడా ఫోన్లు తీసుకొచ్చేందుకు వీల్లేకుండా పోయింది.

ఏపీ అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ సెల్ ఫోన్లపై నిషేధం విధించలేదు. దేశంలోని ఇతర చట్ట సభల్లో తలెత్తిన పరిణామాలు, సభ్యుల ప్రవర్తనతో గతంలో పలుమార్లు సెల్ ఫోన్లు బ్యాన్ చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అయితే గతేడాది మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో మండలిలో సైతం సెల్ ఫోన్ రికార్డింగ్ లు చోటు చేసుకున్నాయి. అయితే మండలిలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు ఎపిసోడ్ జరిగిన కారణంగా అసెంబ్లీలో మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీ సభ్యులు అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం, వైసీపీ సభ్యులు మాత్రమే హాజరవుతున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ మేరకు అమలవుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియబోతున్నాయి. అంటే వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచి ఈ నిర్ణయం అమలు చేయాల్సి ఉంటుంది.