అమరావతిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ - కేంద్ర మంత్రులకు లేఖలు : నిర్మాణాలు మొదలు పెట్టాలి..!!
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు అమరావతిలో పర్యటించనున్నారు. ఆ ప్రాంత రైతులతో కలిసి రాజధాని గ్రామాల్లో ఈ రోజు పర్యటిస్తారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన..ఆ తరువాత అసెంబ్లీలో బిల్లుల ఉప సంహరణ..అమరావతి పైన హైకోర్టు తీర్పు తరువాత పరిస్థితుల పైన ఆయన కేంద్ర మంత్రులకు లేఖలు రాసారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల్లోగా అమరావతిలో నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేయలేదని..దీని ద్వారా తీర్పు అమలు కావాల్సిన అసవరం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ఆరు నెలలు కాదు..అరవై నెలలు కావాలంటూ కోర్టులో అఫిడవిట్ ను ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. ఇక, ఈ పర్యటన సమయంలోనే జీవీఎల్ కేంద్ర సంస్థలు నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులకు లేఖలు రాసారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.

అనేక కేంద్ర సంస్థలు అమరావతిలో స్థల సేకరణ జరిపాయని.., అయితే ప్రభుత్వ మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి కారణాలతో ఆయా శాఖలు వేచి చూశాయని లేఖలో తెలిపారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చినతీర్పు దృష్ట్యా ఇక జాప్యం లేకుండా ఆయా శాఖలు, సంస్థలూ కార్యాలయాలు నిర్మించాలని జీవీఎల్ నరసింహారావు తన లేఖల్లో కోరారు. స్థలాలలో ఆరు నెలలలోగా భవన నిర్మాణం ప్రారంభించాలన్న షరతు ఉన్న విషయాన్ని జీవీఎల్ నరసింహారావు గుర్తు చేస్తూ ఇప్పటికైనా నిర్మాణాలపై దృష్టి సారించాలని లేఖల్లో సూచించారు.
రాజధాని నిర్మాణం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు కీలకమని చెప్పుకొచ్చారు. గతంలోనే కేంద్ర సంస్థలు నిర్మాణాల దిశగా ఒప్పందాలు - నిర్ణయాలు చేసుకున్నా.. ప్రభుత్వం మారటం.. మూడు రాజధానుల అంశం తెర మీదకు రావటంతో ఈ వ్యవహారంలో పురోగతి కనిపించ లేదు. ఇక, ఇప్పుడు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వటంతో..ఈ నిర్మాణాల పైన మరోసారి కదలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది.