రికార్డు సృష్టించిన రామ్మోహన్ నాయుడు... అతి పిన్న వయసులో ప్రతిష్టాత్మక అవార్డు...
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. మొత్తం 8 మంది లోక్సభ ఎంపీలను,ఇద్దరు రాజ్యసభ సభ్యులను అవార్డులకు ఎంపిక చేయగా... అతి పిన్న వయసులో రామ్మోహన్ నాయుడుకి ఈ పురస్కారం లభించడం విశేషం. రామ్మోహన్ నాయుడికి 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు'ను సంసద్ రత్న జ్యూరీ ప్రకటించింది. గుణాత్మకమైన పనితీరు,వ్యక్తిగత కృషి ఆధారంగా రామ్మోహన్ నాయుడుకి ఈ అవార్డు దక్కింది. టీడీపీ,కింజరపు కుటుంబ వారసునిగా ప్రజాసేవలో ఇది తనకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

ఆ 8 మంది వీరే...
ఎన్సీపీ ఎంపీలు సుప్రియా సూలే(బారామతి, మహారాష్ట్ర), అమోల్ రాంసింగ్ కోల్హే(షిరూర్,మహారాష్ట్ర) బీజేపీ ఎంపీలు సుభాష్ రామారావు బమ్రే(ధూలే,మహారాష్ట్ర),హీన గవిత్(నందుర్బర్,మహారాష్ట్ర),నిషికాంత్ దూబే(గొడ్డా,జార్ఖండ్),అజయ్ మిశ్రా(ఖేరీ,ఉత్తరప్రదేశ్), కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(తిరువనంతపురం,కేరళ), రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం,ఆంధ్రప్రదేశ్)లకు ఈ అవార్డులు లభించాయి.

ఎవరెవరికి ఏ ప్రాతిపదికన అవార్డులు..
17వ లోక్సభ మొదటి ఏడాది చర్చలు లేవనెత్తిన తీరు,సభలో అడిగిన ప్రశ్నలు,ప్రైవేట్ మెంబర్ బిల్లుల ఆధారంగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేకి సంసద్ రత్న అవార్డును కేటాయించారు. ఎంపీలు సుభాష్ రామరావ్ బమ్రే,హీనా గవి,అమోల్ రాంసింగ్లకు సభలో లేవనెత్తిన ప్రశ్నలకు.. వుమెన్&ఫస్ట్ టైమ్ ఎంపీ కేటగిరీలో అవార్డులు కేటాయించారు.

రాజ్యసభ నుంచి ఇద్దరికి..
ఎంపీలు శశి థరూర్,నిషికాంత్ దూబే,అజయ్ మిశ్రా,రామ్మోహన్ నాయుడులకు వారి గుణాత్మక పనితీరు,వ్యక్తిగత కృషి ఆధారంగా 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు'ను ఇచ్చారు. రాజ్యసభ నుంచి ఇద్దరు ఎంపీలు విశంబర్ ప్రసాద్ నిషాద్(ఉత్తరప్రదేశ్),ఛాయా వర్మ(ఛత్తీస్ గఢ్) కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 16వ లోక్సభకు కూడా సంసద్ రత్న అవార్డులను ప్రకటించగా... బీజేడీ ఎంపీ భర్తృహరి మెహ్తబ్(కటక్,ఒడిశా),సుప్రియా సూలే(బారామతి,మహారాష్ట్ర),శ్రీరంగ అప్ప (శివసేన,మవల్,మహారాష్ట్ర)లు ఎంపికయ్యారు.

ఆ తర్వాతే అవార్డుల ప్రధానోత్సవం..
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ బృందం ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010 లో సంసద్ రత్న అవార్డులు ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి తగ్గి, లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరువాత అవార్డుల ప్రదానం కార్యక్రమం వుంటుందని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంసద్ రత్న అవార్డుల కమిటీ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.