పవన్‌కు బొట్టు పెట్టి పిలవాలా?, బతిమాలుకోవాల్సిన అవసరం లేదు: ముద్రగడ ఫైర్
గుంటూరు: గత ఎన్నికల్లో కాపులను బీసీల్లో కలుపుతామంటూ ఇచ్చిన హామిని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన కాపు సంఘాలన్ని పోరాడుతున్న సంగతి తెలిసిందే. తుని ఘటన ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన ముద్రగడ.. మరోమారు ప్రభుత్వానికి కాపు ఉద్యమ సెగ తగిలించాలనే ప్రయత్నంలో ఉన్నారు.
ఇందుకోసం ఆయన క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ముద్రగడ పర్యటించారు. ఈ సందర్బంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్.. కాపు ఉద్యమానికి చేసేందేమి లేదని అన్నారు.

ఏ రోజు పవన్ కాపు ఉద్యమానికి సహరించలేదని, కాపు ఉద్యమానికి దూరంగా ఉంటున్నవాళ్లను బతిమాలుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా గతంలో పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపామని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ముద్రగడ తెలిపారు.
చివరలో ముద్రగడ మరింత ఘాటుగా స్పందించారు. కొంతమంది ఉద్యమానికి దూరంగా ఉన్నంత మాత్రాన తమ ఉద్యమం ఆగిపోదని, బొట్టు పెట్టి మరీ పిలిచేందుకు ఇదేమి ఎవరి ఇంట్లోనో జరుగుతున్న పెళ్లి కాదని ముద్రగడ ఎద్దేవా చేశారు.
కాగా, తనకు కుల రాజకీయాలు నచ్చవని, ఏ ఒక్క కులం తరుపునో పోరాడటానికి తాను వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో బలమైన ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమానికి మద్దతునిస్తే.. ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉండటంతో.. కాపు సంఘాలన్ని పవన్ మద్దతు కోరుతున్నాయి. అయితే ఎంతకీ ఆయన నుంచి స్పందన కరువవడంతో ఇక ఆయన్ను కదిలించకపోవడమే మంచిదన్న ఆలోచనలో ముద్రగడ ఉన్నారు.