ముద్రగడ ట్విస్ట్: చంద్రబాబుకు ఊరట, జగన్కు షాక్
పశ్చిమ గోదావరి: కాపుల రిజర్వేషన్ల కోసం గళమెత్తిన ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కొంత ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉన్నాయి.
అసలు ముద్రగడ పద్మనాభం ఏమన్నారంటే.. కాపులకు రుణాలు బాగానే అందుతున్నాయని అన్నారు. కాపు కమిషన్లో ప్రభుత్వం నియమించిన వ్యక్తులుంటేనే ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని ముద్రగడ వ్యాఖ్యానించారు.
Also Read: కులాల కుంపట్లు: కెసిఆర్ పంథాలో చంద్రబాబు?
తాను సూచించిన వారిని నియమిస్తే ప్రశ్నించే అవకాశం ఉండదని ముద్రగడ పద్మనాభం పేర్కొనడం గమనార్హం. పరిశీలన తర్వాతే రిజర్వేషన్లపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం అన్నారు.

ముద్రగడ కాపుల రిజర్వేషన్ల కోసం ఇటీవల చేసిన ఆందోళనలు చంద్రబాబుకు కొంత తలనొప్పిగా మారాయి. ఆ తర్వాత మంత్రులతో చర్చలు జరిపించి ముద్రగడను శాంతింపజేశారు. అయితే, మరోసారి కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించక తప్పదని ఆయన పునరుద్ఘాటించారు.
అంతేగాక, చంద్రబాబునాయుడుపై ఘాటైన విమర్శలు కూడా చేశారు. కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వడం మండిపడ్డారు. తన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తన వెనక జగన్ ఉన్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. జగన్ నిన్న గాక మొన్న పుట్టారని, తన రాజకీయ జీవితం జగన్తో ముడిపడి లేదని, చంద్రబాబు రాజకీయం తనకు తెలుసునని ఆయన అన్నారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, జగన్తో తనకు సంబంధం ఉన్నట్లు రుజువు చేయాలని, అలా రుజువు చేస్తే తానూ తన కటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన చెప్పారు.
తన జాతికి నష్టం జరిగినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. రుజువు చేయకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పిలిచినా తాను వెళ్లలేదని ఆయన చెప్పారు. వైయస్పై ప్రేమతో తాను జగన్ కోరిక మేరకు ఓదార్పు చేశానని, అంతకు మించి సంబంధం లేదని ఆయన అన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని చంద్రబాబును హెచ్చరించారు.
కాగా, తాజాగా చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ముద్రగడ మాట్లాడటం విశేషం. ఇది చంద్రబాబునాయుడుకు కలిసి వచ్చే అంశంగా తెలుస్తోంది. అయితే, జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేసి ఉండవచ్చు. చంద్రబాబు నుంచి కొత్తగా ఏ హామీ ఇవ్వనప్పటికీ ముద్రగడ వ్యాఖ్యల్లో మార్పు రావడంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.