ఏపీలో మున్సిపల్ పోరు షురూ- నామినేషన్ల ఉపసంహరణతో- మళ్లీ నామినేషన్లకూ అవకాశం ?
ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన పురపాలక ఎన్నికల ప్రక్రియ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మున్సిపల్ పోరును ఎస్ఈసీ ఇవాళ అధికారికంగా ప్రారంభించింది. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లయింది. ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఎన్నికల కోడ్‌ను ఏపీలోనూ అమలు చేయాలని ఎస్ఈసీ నిర్ణయించడంతో ఆ మేరకు అభ్యర్ధులకు ఆంక్షలు కూడా పలకరించున్నాయి.

ఏపీలో మున్సిపల్ పోరు ప్రారంభం
ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికల పోరును ఇవాళ తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలుపెట్టారు. గతంలో ఎక్కడ నిలిపేశారో అక్కడి నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీంతో ఇవాళ రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా చోట్ల గట్టి భద్రత మధ్య గతంలో తీసుకున్న నామినేషన్లను బయటికి తీసి దుమ్ముదులిపారు.

మరోసారి నామినేషన్లకు అవకాశం
ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో గతంలో నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలు జరిగిన చోట అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్ఈసీ వారికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్ధుల నుంచి కలెక్టర్లు ఫిర్యాదులు స్వీకరించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు పంపారు. వాటిని పరిశీలించి ఇవాళ లేదా రేపు మరోసారి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎస్ఈసీ నిర్ణయించారు. వాస్తవంగా ఇలా నామినేషన్లు మళ్లీ అనుమతించేందుకు ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో ఎన్నికల కమిషనర్‌గా తన విశేషాధికారాన్ని వాడుతూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ (సంశయ లాభం) కింద అవకాశం ఇవ్వాలని నిమ్మగడ్డ నిర్ణయించారు.

ఏపీలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్
మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా ఇవాళ్టి నుంచి పూర్తిస్ధాయిలో అమల్లోకి వచ్చింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ప్రకటించిన ఎన్నికల కోడ్‌నే ఏపీలోనూ అమలు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్ధులు, పార్టీలు సహకరించాలని కూడా కోరారు. దీంతో ఇంటింటి ప్రచారానికి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. అలాగే నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ వంటి చోట్ల అభ్యర్ధితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. ప్రచారంలోనూ ఆంక్షలు ఉంటాయి.