జగన్ పాలనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు ..
ఏపీలో అధికార పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించడం పై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. టిడిపితో లింకు పెట్టి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న వైసిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ వందరోజుల పాలనలో రాష్ట్రంలో గందరగోళం నెలకొందని జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ జగన్ వంద రోజుల పాలన పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దు: వీహెచ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్, ఏం చెప్పారంటే..?

జగన్ 100 రోజుల పాలనలో స్పష్టత లేదన్న నాదెండ్ల మనోహర్
జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ 100 రోజుల పాలన గురుంచి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జగన్ 100 రోజుల పాలనలో స్పష్టత లేదని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్ . రాజధాని విషయం లో చెలరేగిన దుమారం పై ఇప్పటివరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి విషయంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలు సరికావని, దీనిపై జగన్ మౌనం వీడాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

రాజధాని విషయంలో సీఎం క్లారిటీ ఇవ్వాలని కోరిన నాదెండ్ల మనోహర్
రాజధాని నిర్మాణ పనులలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెబుతూ పనులు ఆపడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజంగా గత ప్రభుత్వంలో అవినీతి జరిగి ఉంటే విచారణ జరిపించి అవినీతిని నిరూపించాలని కోరారు నాదెండ్ల. అసలు విషయాన్ని పక్కన పెట్టి వైసిపి నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు తో లింక్ చేస్తూ మాట్లాడటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఇసుక విధానం వల్ల ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని, ఇక భూముల ధరలు దారుణంగా పడిపోయాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

పోలవరం రివర్స్ టెండరింగ్ సరికాదన్న నాదెండ్ల మనోహర్
సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి తీరు సరికాదని ఆయన అన్నారు.ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో నిజంగా అవినీతి జరిగితే విచారణ జరిపించాలని చెప్పారు. అంతేకాదు ఇప్పటికైనా రాజధాని విషయంలో జగన్ మౌనం వీడాలని, స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని, జగన్ తన ప్రకటనతో ప్రజల్లో భరోసా కల్పించాలని పేర్కొన్నారు. మొత్తం మీద వైసిపి వంద రోజుల పాలన పై, జగన్ పరిపాలన తీరుపై నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!