రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా?: ఏపీ సర్కారు, సినీ పెద్దలపై నాదెండ్ల మనోహర్ ఫైర్
అమరావతి: సినీ పరిశ్రమ ప్రముఖులపై జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదానికి తెరదించుతూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. టికెట్ల వివాదంతో పాటు మరికొన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపించింది.. దీనిపై స్పందించిన సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు.

సినీ ఇండస్ట్రీ పెద్దలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు
అంతేగాక, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్కు సన్మానం చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. అయితే, సినీ ఇండస్ట్రీ పెద్దల వైఖరిని తప్పుబట్టారు నాదెండ్ల మనోహర్. జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న ఆయన.. ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీలతో సమావేశం అయ్యారు. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సినిమా టిక్కెట్ల పెంపు జీవో జారీ.. సినీ ఇండస్ట్రీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు నాదెండ్ల మనోహర్.

రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా?: నాదెండ్ల మనోహర్
సినిమా ఇండస్ట్రీ సీఎంకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందనన్నారు నాదెండ్ల మనోహర్. సినీ ఇండస్ట్రీ పెద్దల వైఖరి మారాలని సూచించారు. వినోదాన్ని పేదలకు అందుబాటులోకి తెస్తానన్న ప్రభుత్వం.. ఇప్పుడు రేట్లు పెంచింది.. దీనికేం సమాధానం చెబుతారు..? అని సినీ పెద్దలను ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్. రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా..? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశఆరు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరును తప్పుపడుతూ ప్రజలకు సినీ ఇండస్ట్రీ అండగా నిలబడాలని సూచించారు.

బీమ్లా నాయక్ విడుదల తర్వాతే జీవో రావడంపై అసంతృప్తి
తమ విషయంలోనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అనేది సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. కాగా, ఈ మధ్యే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీ విడుదలై.. వారం గడిచిన తర్వాత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జీవో జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.